హైదరాబాద్, నమస్తే తెలంగాణ: యాసంగిలో తెలంగాణలో భారీగా ధాన్యం కొనుగోలు చేయడంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ ప్రశంసించారు. ‘2020-21 యాసంగి సీజన్‌లో దేశవ్యాప్తంగా ధాన్యం, గోధుమల కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 50 లక్షల టన్నుల ధాన్యం సేకరించారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భాగమే 44.36 లక్షల టన్నులుగా ఉన్నది. ఒక్క తెలంగాణలోనే (ఈ నెల 7 నాటికి) 34.36 లక్షల టన్నుల ధాన్యం, ఆంధ్రప్రదేశ్‌లో 10 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు’ అని పాశ్వాన్ శనివారం ట్విట్టర్‌లో వెల్లడించారు. దీనిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు స్పందించారు. యాసంగి ధాన్యం సేకరణలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలువడం తెలంగాణ ప్రజలు, రైతులందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంతోనే ఆరేండ్లలోపే తెలంగాణ కీలక విజయాలను నమోదుచేసుకున్నదని ట్వీట్ చేశారు. రాష్ట్రంలో యుద్ధప్రాతిపదికన నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేయడం, సాగుకు సాయమందించే రైతుబంధు పథకం, రైతులకు 24 గంటల ఉచితవిద్యుత్, గోదాముల సామర్థ్యాన్ని ఆరింతలుచేయడం వంటి కార్యక్రమాలు ఈ ఘనతకు కారణమని పేర్కొన్నారు.
35.74 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
రాష్ట్రంలో శనివారంనాటికి రైతుల నుంచి 35.74 లక్షల టన్నుల వరిధాన్యాన్ని రాష్ట్రప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ ఏడాది వానకాలం, యాసంగిలో కలిపి దేశవ్యాప్తంగా 653.73 లక్షలటన్నులు వరిధాన్యం సేకరించగా అందులో 162.33 లక్షలటన్నులతో పంజాబ్ మొదటిస్థానంలో, 77.24 లక్షలటన్నులతో తెలంగాణ రెండోస్థానంలో ఉన్నాయి.