ఏపీలో తగ్గుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా (కోవిడ్‌-19) పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. గత నెల నుంచి ఇప్పటివరకూ చూస్తే… పాజిటివ్‌ కేసుల తగ్గుతూ వచ్చాయి. మరోవైపు కరోనా వైరస్‌ సోకిన వారు వేగంగా కోలుకుంటున్నారు. కాగా రాష్ట్రంలో కొత్తగా 43 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,930కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శనివారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. 

గత 24 గంటల్లో 8,338మంది శాంపిల్స్‌ పరీక్షించగా.. అందులో కొత్తగా 43 మందికి కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయింది. కొత్తగా కృష్ణా జిల్లాలో 16,చిత్తూరు జిల్లాలో 11, అనంతపురం జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 6, విశాఖపట్నం జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. మరోవైపు దేశంలోనే అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహిస్తూ ఏపీ నెంబర్‌ వన్‌గా నిలిచింది. ఇప్పటివరకు 1,65,069 మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది.

కర్నూలులోనూ తగ్గుముఖం
కర్నూలు జిల్లాలో కూడా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కోవిడ్‌ ఆస్పత్రుల నుంచి శనివారం 21మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కాగా జిల్లాలో ఇప్పటివరకూ 239మంది కరోనాను జయించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల ప్రకారం అధికారులు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన ఒక్కొక్కరికి రూ.2000 నగదు పంపిణీ చేసి, వారిని ఇంటికి చేర్చుతున్నారు.