మహబూబ్‌నగర్ విద్యావిభాగం : ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నది. జిల్లాలో 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమైన కేంద్రంగా ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలను, అడిషనల్‌గా మరో 2 కేంద్రాలను ఎంపిక చేశారు. అందులో ప్రభుత్వ మహిళా కళాశాల, రిషి జూనియర్ కళాశాలలు ఉన్నాయి. 900 మంది ఉద్యోగులను నియమించినట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన ఉద్యోగులు సోమవారం ఇంటర్ విద్య జిల్లా అధికారి కార్యాలయంలో రిపోర్టు చేయాలని జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు ఆదేశించారు. నిర్ణీత దూరం పాటించేలా వాల్యుయేషన్ కేంద్రాల వద్ద అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. 20 నుంచి 25 రోజుల్లో వాల్యువేషన్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా ఇంటర్ పరీక్షలు నిర్వహించి రెండు నెలలు గడిచింది. జిల్లాలో 20,433 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన వెంటనే స్పాట్ వాల్యుయేషన్ చేపట్టేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టగా కరోనా నేపథ్యంలో నిలిపివేశారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి
ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించే కేంద్రాల వద్ద ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇప్పటికే గదులను శుభ్రం చేయించాం. నిర్ణీత దూరంలో ఉద్యోగులు విధుల్లో పాల్గొనేలా టేబుళ్లను ఏర్పాటు చేసి ప్రతి టేబుల్‌కి 3 మీటర్ల దూరం ఉండేలా చర్యలు తీసుకున్నాం. శానిటైజర్లతోపాటు మాస్కులు, నీళ్లు అందుబాటులో ఉంచాం. – వెంకటేశ్వర్లు, జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి