హైదరాబాద్ నగరంలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌కు ఈ నెల 13వ తేదీ నుంచి అధికారులు సెలవు ప్రకటించారు. మార్కెట్ ప్రాంగణంలో భౌతిక దూరం పాటించాలన్న నిబంధనలకు విఘాతం కలగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నిబంధనలు ఉల్లంఘించిన 44 మంది కమీషన్ ఏజెంట్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కోహెడ మార్కెట్ బంద్ కారణంగా గడ్డి అన్నారం మార్కెట్లో వ్యాపారుల రద్దీ పెరిగింది.
రద్దీ దృష్ట్యా తాత్కాలిక సెలవు ప్రకటించింది వ్యవసాయ మార్కెట్ కమిటీ. దీంతో రేపట్నుంచి మామిడి కాయల అమ్మకాలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు రైతులకు సమాచారం అందించినట్లు ఏఎంసీ తెలిపింది. రైతులు తెలియక తీసుకొస్తే సరూర్ నగర్ వీఎం హోమ్స్ మైదానం తాత్కాలిక మార్కెట్ లో కొనుగోళ్లు జరుపుతామన్నారు. గడ్డి అన్నారం మార్కెట్ పునఃప్రారంభం ఎప్పుడనేది ఉన్నతాధికారులదే నిర్ణయమని ఏఎంసీ కార్యదర్శి వెంకటేశం స్పష్టం చేశారు. రైతులు, కమీషన్ ఏజెంట్లు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మార్కెట్ తెరిస్తే రోజూ కొద్ది మంది నుంచి మామిడి కొనుగోళ్లు చేస్తామన్నారు. రైతులు తొందరపడి సరకు తీసుకురావొద్దు అని సూచించారు.
భారీగా వీచిన ఈదురుగాలులకు కోహెడ పండ్ల మార్కెట్ ఈ నెల 4వ తేదీన నేలమట్టమైన విషయం విదితమే. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కరోనా నేపథ్యంలో గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను తాత్కాలికంగా కోహెడకు తరలించిన విషయం తెలిసిందే. కోహెడ వద్ద పండ్ల మార్కెట్ పునరుద్ధరణ పనులు చేపట్టారు.