తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. సోమవారం 79 కేసులు నమోదు కాగా, మంగళవారం 51 కేసులు నమోదైనట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,326కి చేరుకుంది. కరోనాతో మంగళవారం ఇద్దరు చనిపోయారని బులిటెన్‌లో వెల్లడించారు. వీరిలో హైదరాబాద్ మూసాబౌలికి చెందిన 61 ఏళ్ల వ్యక్తికి కరోనాతోపాటు బీపీ, ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉండటంతో మృతి చెందినట్టు వివరించారు. అలాగే జియాగూడకు చెందిన 65 ఏళ్ల వ్యక్తిని ఓ ప్రైవేటు ఆసుపత్రి నుంచి సోమవారం గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారని, ఆయనకు మధుమేహం, బీపీ కూడా ఉండటంతో చికిత్స పొందుతూ చనిపోయారని పేర్కొన్నారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో చనిపోయినవారి సంఖ్య 32కి చేరుకుందని తెలిపారు. కాగా, తాజాగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 37 జీహెచ్‌ఎంసీ పరిధిలోనివి కాగా, మిగిలిన 14 కేసులు వలస కూలీలవని వెల్లడించారు.
వలస కూలీల్లో 12 మంది యాదాద్రి జిల్లాకు చెందినవారుండగా, మరో ఇద్దరు జగిత్యాల జిల్లాకు చెందినవారున్నారు. మంగళవారం 21 మంది కోలుకున్నారని, దీంతో ఇప్పటివరకు మొత్తం 822 మంది డిశ్చార్జి అయ్యారని బుటిటెన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో 472 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. మంగళవారం డిశ్చార్జి అయినవారిలో హైదరాబాద్‌కు చెందినవారు 13 మంది ఉండగా.. రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలకు చెందినవారు ముగ్గురు చొప్పున.. మేడ్చల్, వరంగల్ అర్బన్ జిల్లాలకు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారు.
వలసదారులంతా క్వారంటైన్‌కే..
వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు రాష్ట్రానికి వస్తున్నారని, వారిలో లక్షణాలు లేనివారిని హోంక్వారంటైన్ లేదా ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలుంటే వారిని ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాలకు తరలించి తదుపరి రోగ నిర్దారణ పరీక్షలు చేస్తారని తెలిపారు. కొత్తగా వలస వచ్చినవారుంటే, వారి గురించి స్థానిక అధికారులకు తెలియజేయాలని ప్రజలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.