నైరుతి రుతుపవనాలు జూన్ 16 నుంచి 24 మధ్య రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని, ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని జర్మనీలోని పోట్స్‌డామ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ క్లైమెట్ ఇంపాక్ట్ రిసెర్చ్ గ్రూప్ లీడర్ ప్రొఫెసర్ ఎలీనా సురోవ్యాట్కినా అంచనావేశారు. జూలైలో కొద్దిరోజులు వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశమున్నా ఆ తర్వాత రుతుపవనాలు జోరందుకుంటాయని చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం గురువారం ఏర్పాటుచేసిన వెబినార్‌లో ఆమె ‘ఫోర్‌కాస్ట్ ఆఫ్ మాన్సూన్ ఆన్‌సెట్-2020, సెంట్రల్ ఇండియా, తెలంగాణ’ అంశంపై జర్మనీనుంచి ప్రసంగించారు.
వర్సిటీ పరిపాలనా భవనంలోని కమిటీహాల్ నుంచి వీసీ డాక్టర్ వీ ప్రవీణ్‌రావు ఈ వెబినార్‌ను ప్రారంభించారు. జూలై 15 నుంచి మూడు నెలలపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రొఫెసర్ ఎలీనా అన్నారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం 854 మిల్లీమీటర్ల వరకు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. జర్మనీలో ఉన్న వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్ సీహెచ్ రమేశ్ వెబినార్‌లో పాల్గొంటూ.. దేశంలో సన్న, చిన్నకారు రైతులే అధికమని, నూటికి 60 నుం చి 70 శాతం వరకు వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. వీసీ ప్రవీణ్‌రావు మాట్లాడుతూ.. గత ఏడాది రుతుపవనాలపై ప్రొఫెసర్ ఎలీనా వేసిన అంచనాలు దాదాపు వాస్తవరూపం దాల్చాయని చెప్పారు. కార్యక్రమంలో పరిశోధన విభాగం సంచాలకుడు డాక్టర్ ఆర్ జగదీశ్వర్, రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్‌కుమార్ పాల్గొన్నారు.