కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణలో కూడా లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కేబినెట్ సమావేశంలో కేంద్ర మార్గదర్శకాలపై విస్తృతంగా చర్చించినట్లు చెప్పారు. అధికారులతో మాట్లాడి వ్యూహరచన చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో కంటైన్మెంట్ ఏరియాలు మినహా.. మిగతావన్నీ గ్రీన్‌జోన్లేనని పేర్కొన్నారు. కేబినెట్ సమావేశం అనంతరం సీఎం మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘ప్రస్తుతం1,452 కుటుంబాలు కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఉన్నాయి. కంటైన్మెంట్ ప్రాంతాల్లో పోలీస్ పహారా ఉంటుంది. కరోనాకు వ్యాక్సిన్ రేపోమాపో వచ్చే పరిస్థితి లేదని ప్రపంచం అంగీకరించింది. కరోనాతో జీవించడం నేర్చుకోవాలి. బతుకుదెరువు కోసం అన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోవాలి. హైదరాబాద్ నగరం తప్ప అన్నిచోట్లా అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చు. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎక్కడ దుకాణాలు తెరవాలో ప్రకటిస్తారని’ సీఎం పేర్కొన్నారు.
రేపటి నుంచే బస్సులు నడుస్తాయ్ – సీఎం కేసీఆర్
తెలంగాణలో ఆర్టీసీ బస్సులు రేపటి నుంచే నడుస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. జిల్లాలకు చెందిన బస్సులు మాత్రమే నడుస్తాయని స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు హైదరాబాద్ పరిధిలో సిటీ బస్సులకు, ఇతర రాష్ట్రాల బస్సులకు అనుమతిలేదని తెలిపారు. మాస్కులు ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కేబినెట్ సమావేశం అనంతరం సీఎం మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘హైదరాబాద్‌లో ఆటోలు, ట్యాక్సీలకు అనుమతినిస్తున్నాం. హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులు తిరగవు. మెట్రో రైలు సర్వీసులు కూడా పనిచేయవు. ఆర్టీసీ బస్సులు కోవిడ్-19 జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు వందశాతం సిబ్బందితో పనిచేసుకోవచ్చు. పరిశ్రమలన్నింటికీ అనుమతి. హైదరాబాద్ నగరంలో సరిబేసి విధానంలో దుకాణాలు తెరవాలి. సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లకు అనుమతి లేదు. అన్ని రకాల విద్యాసంస్థల బంద్ కొనసాగుతుందని’ సీఎం వివరించారు.
లాక్ డౌన్ 4.0..రాష్ట్రంలో వీటికి అనుమతి లేదు
రాష్ట్రంలో మే 31 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కంటైన్ మెంట్ జోన్లు మినహా రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే లాక్ డౌన్ 4.0 సడలింపులు ఇస్తున్నా..రాష్ట్రంలో వీటికి మాత్రం అనుమతులు ఉండబోవని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
అన్ని రకాల విద్యాసంస్థలు, శిక్షణా కేంద్రాలు బంద్
సినిమాథియేటర్లు, పంక్షన్ హాల్స్‌కు అనుమతి లేదు.
బార్లు, పబ్బులు, క్రీడామైదానాలు.,క్లబ్ లు, జిమ్‌లు, పార్కులు బంద్
మెట్రో రైలు సర్వీసులు బంద్
అన్ని రకాల ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు మూసివేత