★ రైతుల తలరాత రైతులే రాసుకోవాలె
★ తెలంగాణలో నడుస్తున్నది రైతురాజ్యమే
★ రైతులకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నన్ని పథకాలు
దేశంలో ఏ రాష్ట్రమూ అమలు చేయడం లేదు
★ కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలె
★ మే 31 వరకూ తెలంగాణలో లాక్ డౌన్
★ కేంద్రం చెబుతున్న ప్యాకేజీ అత్యంత దుర్మార్గమైనది
★ రాష్ట్రాలను బిచ్చగాళ్లుగా చూస్తున్న కేంద్రం
★ శిశుపాలుడి వంద తప్పుల కోసం ఎదురు చూడలేదా ?
★ సమయం వచ్చినప్పుడు ప్రజలే నిర్ణయిస్తరు
★ తెలంగాణలో నియంత్రిత పద్దతిలో పంటల సాగుకు
సమగ్ర కార్యాచరణ విధానం
★ లాభసాటి పత్తి పంట వైపు ఎక్కువగా మొగ్గు చూపాలి
★ కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రయోజనాల విషయంలో
ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదు
★ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఘర్షణ వైఖరితో
ఏం సాధించిండు ? ఒక్క టి.ఎం.సి నీళ్లు తేగలిగిండా ?
★ మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా అంశాల్లో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని మరోసారి విస్పష్టంగా ప్రకటించారు . ఆయన మాటల్లో కరోనా అంశం కంటే తెలంగాణ వ్యవసాయ రంగం స్థితిగతుల్ని సమూలంగా మార్చివేసి రైతుల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేయడానికే ఎక్కువ సమయం కేటాయించారు. నియంత్రిత పద్దతిలో పంటల సాగుకు సంబందించి అన్ని రకాలుగా విశ్లేషించి ఎన్నో సమీక్షలతో రూపొందించిన బ్లూ ప్రింట్ ను ఆవిష్కరించారు . ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే లక్షలాది మంది ప్రజలు ఈ రోజు కూడా ముఖ్యమంత్రి ఎన్నో అంశాల మీద నిష్కర్షగా మాట్లాడటం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు .
————————————————
70లక్షల ఎకరాల్లో పత్తి పండిద్దాం
————————————— ——  —— 
రైతులకు ఉచిత నీటి సరఫరా ఒక్క తెలంగాణలోనే ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కొన్ని రకాల అరుదైన పండ్లకు తెలంగాణ కేంద్రంగా ఉందని తెలిపారు. తెలంగాణ అవతరించాక దేశ చరిత్రలో లేనివిధంగా రైతు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో అమలు చేసే పథకాలను అందరూ అనుసరిస్తున్నారని సీఎం తెలిపారు.
‘నీటిపారుదల ప్రాజెక్టుల ఫలాలు మనం చూస్తున్నాం. 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ తెలంగాణలో ఉంది. వేలాది పాడిపశువులు పంపిణీ చేసి ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. ఆధునిక పద్ధతుల్లో పంటలు పండించేందుకు విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టాం. 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణదే. రైతాంగం నియంత్రిత విధానంలో వ్యవసాయం చేయాలి. తెలంగాణలో కాటన్ పంటకు అద్భుతమైన భవిష్యత్ ఉంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలే వేయాలి. 70 లక్షల ఎకరాల్లో పత్తిపంటను పండించాలి. గతంలో 53 లక్షల ఎకరాల్లో పత్తి పండించారు..ఈసారి 70 లక్షల ఎకరాల్లో వేయాలి. ప్రభుత్వం చెప్పినట్లు పంటలు వేసి మంచి ధరను రైతు పొందాలి. వ్యవసాయంలో మనం అన్ని రికార్డులను బద్ధలుకొడుతున్నాం. పాలిహౌజ్, గ్రీన్‌హౌజ్ కల్టివేషన్‌కు సబ్సిడీలు ఇస్తున్నామని’ సీఎం వివరించారు.
మన ‘సోనా’కు షుగర్ ఫ్రీ రైస్ అని పేరు
———————————————- —— 
ఏ పంటను ఎలా..ఎప్పుడు పండించాలనేది ప్రభుత్వమే చెబుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వరిలో ఏఏ రకాలు వేస్తే లాభమో అవి మాత్రమే వేయాలని రైతులను కోరారు. వర్షాకాలంలో మక్క పంట వేయవద్దు..బదులుగా కందులు వేయాలని సూచించారు.
‘తెలంగాణ సోనాకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంది. తెలంగాణ సోనాకు షుగర్ ఫ్రీ రైస్ అని పేరుంది. యాసంగిలో మక్కలు పండించాలి. సన్న రకాల్లో తెలంగాణ సోనా మంచిది. 40 లక్షల ఎకరాల్లో వరి పంటలు వేద్దాం. 2 లక్షల ఎకరాల్లో కూరగాయలు పండించాలి. నిజామాబాద్, జగిత్యాలలో పసుపు పంట వేసుకోవచ్చు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో సోయాబిన్ వేసుకోవచ్చు. వరి పంటలో తెలంగాణ సోనా రకం పండించాలని’ సీఎం పేర్కొన్నారు.
‘ప్రభుత్వం చెప్పే పంటలు రైతులతో వేయించే బాధ్యత కలెక్టర్లదే. త్వరలో జిల్లా వ్యవసాయశాఖ అధికారులతో సమావేశం నిర్వహిస్తాం. ప్రస్తుతం 25 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాంలు అందుబాటులో ఉన్నాయి. త్వరలో న్యూస్ ఛానల్ ద్వారా రైతులతో ముఖాముఖి మాట్లాడుతా. తెలంగాణ పంటలన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడయ్యే రోజు రావాలని’ సీఎం కేసీఆర్ కోరారు.
లాక్ డౌన్ 4.0..రాష్ట్రంలో వీటికి అనుమతి లేదు
——————————————————— —— 
రాష్ట్రంలో మే 31 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కంటైన్ మెంట్ జోన్లు మినహా రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే లాక్ డౌన్ 4.0 సడలింపులు ఇస్తున్నా..రాష్ట్రంలో వీటికి మాత్రం అనుమతులు ఉండబోవని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
అన్ని రకాల విద్యాసంస్థలు, శిక్షణా కేంద్రాలు బంద్
సినిమాథియేటర్లు, షాపింగ్ మాల్స్ , పంక్షన్ హాల్స్‌కు అనుమతి లేదు.
బార్లు, పబ్బులు, క్రీడామైదానాలు.,క్లబ్ లు, జిమ్‌లు, పార్కులు బంద్
మెట్రో రైలు సర్వీసులు బంద్ , నగరంలో సిటీ బస్సులు తిరగవు
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి లేదు.
అన్ని రకాల ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు మూసివేత
రేపటి నుంచే బస్సులు నడుస్తాయ్
—————————————— —— 
తెలంగాణలో ఆర్టీసీ బస్సులు రేపటి నుంచే నడుస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. జిల్లాలకు చెందిన బస్సులు మాత్రమే నడుస్తాయని స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు హైదరాబాద్ పరిధిలో సిటీ బస్సులకు, ఇతర రాష్ట్రాల బస్సులకు అనుమతిలేదని తెలిపారు. మాస్కులు ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కేబినెట్ సమావేశం అనంతరం సీఎం మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘హైదరాబాద్‌లో ఆటోలు, ట్యాక్సీలకు అనుమతినిస్తున్నాం. హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులు తిరగవు. మెట్రో రైలు సర్వీసులు కూడా పనిచేయవు. ఆర్టీసీ బస్సులు కోవిడ్-19 జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే బస్సులు ఇమ్లీబన్ బస్టాండ్‌కు కాకుండా..జూబ్లీ బస్‌స్టాండ్‌కు అనుమతిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు వందశాతం సిబ్బందితో పనిచేసుకోవచ్చు. పరిశ్రమలన్నింటికీ అనుమతి. హైదరాబాద్ నగరంలో సరిబేసి విధానంలో దుకాణాలు తెరవాలి. సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లకు అనుమతి లేదు. అన్ని రకాల విద్యాసంస్థల బంద్ కొనసాగుతుందని’ సీఎం వివరించారు.
కేంద్రం ప్యాకేజీ ఉత్త బోగస్
——————————- —— 
కరోనా లాంటి మహమ్మారిపై పోరు చేస్తున్న సమయంలో కేంద్రప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయల పేరుతో ప్రకటించిన ప్యాకేజీ బోగస్ అని సీఎం కేసీఆర్ కొట్టిపారేశారు. కేంద్రం ప్యాకేజీ అంకెల గారడీ అని అంతర్జాతీయ పత్రికలే చెబుతున్నాయి. కేంద్రం ప్రకటించిన దాన్ని ప్యాకేజీ అంటారా ఎవరైనా అని సీఎం ఎద్దేవా చేశారు. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచుతూ దరిద్రపు ఆంక్షలు పెట్టారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్యాకేజీ దగా, మోసమన్నారు. ఆర్థికంగా నిర్వీర్యమైన సమయంలో రాష్ర్టాలను భిక్షగాళ్లను చేస్తారా..అని సీఎం కేసీఆర్ కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో కేంద్రం తీరు జనాలకు తెలియకుండా ఉండదని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
నీళ్ల విషయంలో తెలంగాణ ప్రజయోజనాలే ముఖ్యం
———————————————————— ——  —— 
ఉమ్మడి రాష్ట్రంలో కేటాయింపుల మేరకే ప్రాజెక్ట్‌లు కట్టుకున్నాం. పోతిరెడ్డిపాడుపై సమయం వచ్చినప్పుడు స్పందిస్తాని సీఎం కేసీఆర్ అన్నారు. నీటి వాటాలపై మాకు స్పష్టమైన అవగాహన ఉంది. మాకున్న వాటా మేరకు నీళ్లను వాడుకుంటున్నామని సీఎం చెప్పారు. గోదావరి మిగులు జలాలు ఎవరు వాడుకున్నా అభ్యంతరం లేదని తెలంగాణ ప్రజలకు భంగం కలిగితే మాత్రం ఊరుకునేది లేదన్నారు. రాయలసీమ గోదవారి మిగులు జలాలు వాడుకోవచ్చన్నారు. కృష్ణా జలాల విషయంలో మాత్రం రాజీపడే ప్రసక్తే లేదన్నారు. చట్టం పరిధిలో మా ప్రజలకు న్యాయం చేస్తామని సీఎం చెప్పారు. బాబ్లీపై పంచాయతీ పెట్టి ఏం సాధించారన్నారు. పోతిరెడ్డి పాడు గురించి ఎవరు కొట్లాడారో ప్రజలకు తెలుసని వివాదాలకు పోకుండా సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు.