తెలంగాణలో మరో 27 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా మరో 27 కేసులు నమోదుకాగా, ఇద్దరు వ్యక్తులు డిశ్చార్జ్ అయ్యారు. దీనిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 15 మంది ఉండగా, మరో 12 మంది వలస కార్మికులకు వైరస్ సోకింది.

బుధవారం నమోదైన వలస కార్మికులు జగిత్యాల, జనగాం జిల్లాలకు చెందిన వారని అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా వైరస్ దాడిలో మరో ఇద్దరు వృద్ధులు మృతి చెందారని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 1661కి చేరగా, వైరస్ బారి నుంచి కోలుకోని ఆరోగ్యవంతంగా 1013 మంది ఇళ్లకు చేరారు. ప్రస్తుతం ప్రభుత్వ నోటిఫైడ్ ఆసుపత్రుల్లో 608 చికిత్స పొందుతుండగా, కరోనా మరణాల సంఖ్య 40కి పెరిగిందని అధికారులు వెల్లడించారు. అదే విధంగా ఇప్పటి వరకు 89 మంది వలస కార్మికులకు వైరస్ నిర్ధారణ అయినట్లు అధికారులు స్పష్టం చేశారు.

వైరస్ దాడితో మరో ఇద్దరు వృద్ధులు మృతి..
కరోనా వైరస్ దాడితో రాష్ట్రంలో కొత్తగా మరో ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. మోతీనగర్‌కు చెందిన 61 ఏళ్ల వృద్ధుడు, చంద్రాయణగుట్టకు చెందిన 81 వయస్సు కలిగిన మరో వృద్ధులు చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. వీళ్లకు వైరస్ సోకకముందే ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

14 రోజులుగా 25 జిల్లాల్లో కేసులు లేవు..
రాష్ట్ర వ్యాప్తంగా గత 14 రోజులుగా 25 జిల్లాల్లో కేసులు నమోదు కాలేదు. వీటిలో కరీంనగర్, సిరిసిల్లా, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, భూపాలపల్లి, నాగర్‌కర్నూల్, ములుగు, పెద్దపల్లి, సిద్ధిపేట్, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, వికారాబాద్, నల్గొండ, ఆసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట్, నారాయణపేట్, వరంగల్ అర్బన్, గద్వాల, జనగాం, నిర్మల్ జిల్లాలు ఉన్నాయి.