ఐటీ శాఖను అభినందించిన సీఎం కేసీఆర్‌

2019-2020 ఆర్ధిక సంవత్సరానికి తెలంగాణ ఐటి ఎగుమతుల్లో 17.93 శాతం వృద్ధి సాధించామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

దేశ ఐటి ఎగుమతుల్లో తెలంగాణ వాటా 10.6 శాతం నుంచి 11.6 శాతానికి పెరిగిందన్నారు. తెలంగాణలో ఉద్యోగాల కల్పనలో గతేడాది కంటే 7.2 శాతం వృద్ధి సాధించామన్నారు. ఇందుకు ఐటి శాఖను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఎగుమతుల్లో జాతీయ సగటు 8.09 శాతం కాగా, మిగిలిన దేశాల్లో సగటు 6.92 శాతం మాత్రమేనని అన్నారు. ఇలాంటి తరుణంలో మన రాష్ట్ర ఎగుమతులు 17.93 శాతానికి పెరగడం తెలంగాణ ప్రగతికి నిదర్శమని సిఎం వ్యాఖ్యానించారు.

ఇది తెలంగాణ వృద్ధి జాతీయ సగటు కంటే రెట్టింపు, ఇతర దేశాలతో పోల్చుకుంటే రెండున్నర రెట్లు ఎక్కువ అని పేర్కొన్నారు. అలాగే ఉపాధిలో జాతీయ సగటు 4.93 శాతం కాగా, మిగిలిన దేశాల్లో సగటు 4.59శాతం ఉందని ఉన్నారు. కాగా తెలంగాణలో ఉపాధి 7.2శాతమన్నారు. దీంతో ఉపాధి వృద్ధి రేటు దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణలో 50 శాతం ఎక్కువ అని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఐటి పెట్టుబడుల కోసం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్‌గా మారనుందని అన్నారు. కోవిడ్…-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఐటి పరిశ్రమ మరింత సజావుగా ఉండేలా అన్ని చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఐటి శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

గత ఆర్ధిక సంవత్సరంలో భారత ఎగుమతి వృద్ధిలో తెలంగాణ మొత్తం వాటా 23.53 శాతం కాగా, ఉపాధి వృద్ధిలో తెలంగాణలో మొత్తం వాటా 19.07 శాతానికి చేరుకోడవం ఆనందంగా ఉందని అన్నారు. ఇదే స్పూర్తి, పట్టుదలతో భవిష్యత్తులోనూ పనిచేయాలని ఐటి శాఖను సిఎం కెసిఆర్ కోరారు. 2019-2020 ఆర్ధిక సంవత్సరం (జనవరి 2020 నుంచి మార్చి 2020) చివరి త్రైమాసికంలో కోవిడ్…19 పారంభమైనప్పటికీ, తెలంగాణ నుండి ఎగుమతి వృద్ధి 17.93 శాతం వృద్ధిని నమోదు చేయగలిగిందని ఐటి మంత్రి కేటీఆర్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్‌లు ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌కు వివరించారు.

గత ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌లో పలు కంపెనీల నుంచి పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చాయని కూడా వివరించారు. ముఖ్యంగా అమెజాన్ కంపెనీ అతి పెద్ద క్యాంపస్‌ను ఏర్పాటు చేసిందన్నారు. అలాగే మైక్రాన్ సంస్థ అతిపెద్ద ఆర్ అండ్ డి సెంటర్‌ను కూడా ప్రారంభించిందని వారు గుర్తు చేశారు. ఇక టెక్ మహేంద్రా, సినెట్ సంస్థల కేంద్రాలను వరంగల్ టూ టైర్ ప్రదేశంలో తెరవడానికి సిద్దంగా ఉన్నాయన్నారు. 2019…20-20 సంవత్సరానికి మొదటి రెండు త్రైమాసికాలలో హైదరాబాద్ నగరం వాణిజ్య స్థల పురోగతిలో దేశంలోని అన్ని మెట్రోనగరాలలో అగ్రస్థానంలో ఉందని వివరించారు.