సంగారెడ్డి జిల్లాలోని పీఎన్ఎం లైఫ్‌సైన్స్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలిన ఘటనలో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలైన సంఘటన బొల్లారం పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది. స్థానికులు, సీఐ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. పారిశ్రామికవాడలోని పీఎన్ఎం లైఫ్‌సైన్స్ పరిశ్రమలో రసాయనాలు డ్రమ్ముల్లో కలుపుతుండగా ప్రమాదవశాత్తు రియాక్టర్లపై రసాయనాలు పడడంతో పేలుళ్ళు సంభవించి పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నాయి.
ఈ మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండంతో పరిశ్రమలో విధులు నిర్వహించే ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాపడిన వారిలో మనోజ్(35), స్వామి(40), అనే కార్మికులను హుటాహుటిన నగరంలోని ప్రైవేట్ దవఖానకు తరలించారు. ఎగిసిపడుతన్న మంటలను ఆర్పేందుకు రెడ్డీల్యాబ్కు చెందిన రెండు అగ్నిమాపక వాహనాల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పరిశ్రమ యాజమన్యాలు కార్మికుల భద్రతకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇలాంటి సంఘటనలు పునరవృతం అవుతున్నాయని స్థానికులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.