మనిషి విచక్షణారాహిత్యానికి అంతరించిపోతున్న జీవజాలం
భూమి మీద 14 మిలియన్ల జీవజాతులు
పరిరక్షించుకోక పోతే ముప్పు తప్పదు
ప్రకృతిని కాపాడడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి
నేడు ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం
మనిషి విచక్షణారాహిత్యం వల్ల రోజురోజుకూ జీవవైవిధ్యం దెబ్బ తింటోంది. ప్రకృతి విధ్వంసకర పనుల వల్ల జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది. నానాటికి కాలుష్యం పెరిగిపోవడం, విస్తరించాల్సిన జీవజాతుల శాతం తగ్గిపోవడం జీవ వైవిధ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మానవాళికి భారీ మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నాయి ప్రపంచ పర్యావరణ, జీవవైవిధ్య సదస్సుల నివేదికలు. నేడు ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం.
జీవవైవిధ్యం.. ఆవశ్యకత
అవనిపై జీవించే సకల జీవరాశిని కలిపి జీవవైవిధ్యం అంటున్నారు. సరళంగా చెప్పాలంటే వివిధ రకాల జీవజాతుల సముదాయాన్నే జీవ వైవిధ్యం అంటాం. సూక్ష్మరూపంలోని తొలిజీవి ప్లాజిల్ల్లెటా అనే ఏక కణజీవి ప్రీ బయాటిక్ సూప్ అనే సముద్ర అడుగు నీటిలో పుట్టిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. తొలుత వృక్షాలు, జంతుజాలం అవతరించాయి. క్రమక్రమంగా ఉభయ చరాలు, పక్షులు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం నేలమీద ఎన్నో రకాల వృక్షాలు, పండ్లు, జంతు జాతులు మనుగడ సాగిస్తున్నాయి. సృష్టిలోని ఏజాతి ఉనికైనా జీవ వైవిధ్యం ఎంతో అవసరం. కుందేళ్లు, గేదేలు, జీబ్రాలు వంటివి పచ్చని గడ్డి తింటాయి. ఈ జంతువులను మాంసాహారులైన సింహం, పులి, చిరుతపులులు ఆరగిస్తాయి. గొల్లభామలు గడ్డిని తింటే వాటిని కప్పలు భక్షిస్తాయి. ఈ చక్రంలో ఒక బంధం తెగితే దాని ప్రభావం అనేక రూపాల్లో కనిపిస్తాయి. పాములు నాశనమైతే ఎలుకల సంతతి అనుహ్యంగా పెరిగిపోతుంది. దానితో ఎలుకలు పంటలపై పడి తిండి గింజలను తినేస్తాయి. మానవుడు తన మనుగడ కోసం చుట్టూ ఉన్న పరిసరాలపై ఆధారపడి జీవిస్తాడు. ఆహారం, గాలి, నీరు రక్షణ, ఆశ్రయం నిత్యావసర వస్తువులు అన్నీ ప్రకృతి ఉత్పత్తులే. కంటికి కనబడని ఎన్నో జీవులు సైతం పరోక్షంగా ఎంతో మేలు చేస్తాయి. ఇలా ఒక జీవి మనుగడ మరో జీవి మనుగడకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపయోగ పడటం వల్లనే సకల జీవులు మానవాళిలో మనుగడ సాగిస్తున్నాయి.
జీవవైవిధ్యానికి ఏం చేయాలంటే ..
అడవులను రక్షించుకోవడం అందరి బాధ్యత కావాలి.
ఇంటి వద్ద ముగ్గులు పిండితో వేయాలి. అప్పుడే పక్షులు కీటకాలకు ఆహారంగా లభిస్తుంది.
భవిష్యత్ తరాల కోసం చెట్లు, జలవనరులను పెంపొందించుకోవాలి.
రసాయనాలకు బదులు సహజ ఎరువులు వాడాలి. ప్లాస్టిక్ వినియోగం తగ్గించి భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలి.
ప్రతి ఒక్కరూ జీవవైవిధ్యం పెంపునకు కృషి చేయాలి. పర్యావరణానికి మొక్కలు పెంచాలి2050 సంవత్సరం వరకు దేశ జనాభా 200కోట్లకు పెరిగే అవకాశం ఉంది.
పర్యావరణ పరిరక్షణకు, జనాభా హితం కోసం మొక్కలను విరివిరిగా పెంచాలి. లేకుంటే మనిషి సృష్టిస్తున్న విపత్తు వల్ల జీవవైవిధ్యం అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉంది.
1972 నుంచి ఇప్పటివరకు 61 శాతం వన్యప్రాణులు అంతరించినట్లు వరల్డ్ వైడ్ ఫండ్ ఆఫ్ నేచర్ రిపోర్టు చెబుతుంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరూ ఒక మొక్కనాటి దాన్ని సంరక్షించాలి. అప్పుడే ప్రకృతిని కాపాడే అవకాశం ఉంది. నాగరికత నేర్చిన మానవుడి విచక్షణారాహిత్యం వల్ల ఈ జీవ వైవిధ్యం ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. దీంతో మనుగడ సాగించాల్సిన జీవజాతులు అంతరిస్తున్నాయి. ఇలా ఒక రకమైన జీవులు అంతరిస్తే వాటి మీద ఆధారపడే జీవులూ నశిస్తున్నాయి.
తెలంగాణలో జీవవైవిధ్యం ..
దేశంలో ఆడవులు అధికంగా విస్తరించి ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి. రాష్ట్ర ం జీవ వైవిధ్యానికి కేంద్రం లాంటిది. అనేక రకాల జంతు, పక్షి జాతులకు నెలవు. తెలంగాణ వ్యాప్తంగా 280 రకాల మొక్కల జాతులు ఉన్నాయి. అందులో 1800 రకాల జాతుల మొక్కలు ఔషద మొక్కలే. 900 రకాల ఔషధ మొక్కలు హైదరాబాద్ కేంద్రంగా అందుబాటులో ఉన్నాయి. 108 జాతుల క్షీరదాలు, 486 పక్షి జాతులు తెలంగాణలో మనుగడలో ఉన్నాయి. తెలంగాణ బయోడైవర్సిటీ రిపోర్టు ప్రకారం మన రాష్ట్రంలో అంతరించిపోయే దశలో ఉన్న వాటిలో అడవి కుక్క, ఉడుత , చిరుతపులి, హైనా, మౌస్‌డీర్ , రాబందు, బాతు, హంస, మొసలి, మరిన్ని చేపజాతులు ఉన్నాయి. జీవవైవిధ్యాన్ని పరిరక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు ఆధ్వర్యంలో జిల్లా, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి ఆయా పరిధిలోనే జీవవైవిధ్యాన్ని రక్షించడానికి ఈ బోర్డు కృషి చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా హెరిటేజ్ సైట్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. అందులో భాగంగానే కూకట్పల్లి శివారులోని అమీన్పూర్ లేక్‌ను అభివృద్ధి చేసింది. 2016 నుంచి ఈ చెరువును వలస పక్షుల కోసం చుట్టు పక్కల జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం కోసం ఉపయోగించుకుంటుంది. 93 ఎకరాల్లో విస్తరించిన ఈ చెరువు పరిధిలో కొన్ని వందల స్థానిక పక్షులతోపాటు వలస పక్షులు ఆశ్రయం పొందుతున్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం మనుగడలో ఉన్న జీవులు, చెట్లను గుర్తించి రాష్ట్ర ఐకాన్లుగా ప్రకటించింది. అందులో రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, జంతువుగా జింక, రాష్ట్ర చెట్టుగా జమ్మిచెట్టు, రాష్ట్ర పువ్వుగా తంగేడు ఉన్నాయి.
రక్షించుకోక పోతే ముప్పు తప్పదు
గాలి, నీరు, భూమి ప్రకృతి మనకు ప్రసాదించిన వరాలు. ఆధునికీకరణ మోజులో మనం వాటిని మరిచిపోయాం. చెట్లను ఇష్టమెచ్చినట్లుగా కొట్టేయడం, గాలి, ధ్వని, జల కాలుష్యాల కారణంగా భూతాపం పెరిగిపోయింది. సమతుల్యత దెబ్బతినడంతో జీవవైవిధ్యం వినాశనం జరిగి జీవజాతులు అంతరించే పోయే ప్రమాదస్థాయికి చేరుకుంది. ఇంతటి ఆవశ్యకత కల్గిన జీవ వైవిధ్యాన్ని సరైన మార్గంలో వాడుకొని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. పర్యావరణ పరిశోధకులు డెబ్రా రాబర్ట్ చెప్పినట్లు సదస్సులు, నిర్ణయాలు ఇసుక మీద రాసిన గీత మాత్రమే. ఇప్పటికైనా మనమంతా మేల్కొని కఠిన చర్చలు తీసుకోకపోతే సమీప భవిష్యత్‌లో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది.
దేశంలో ఉన్న అటవీ సంరక్షణ చట్టాలు 1927-భారత అటవీ చట్టం.1972- వన్యప్రాణి సంరక్షణ చట్టం.1980- ఏఐఆర్ చట్టం.1986- పర్యావరణ(రక్షణ) చట్టం.హిమాలమాల్లో ఉండే రెడ్ పాండా అనే జంతువు దాదాపు అంతరించింది అని ఓ సర్వే తేల్చింది.ప్రపంచం గుర్తించిన జీవావరణ రిజర్వులు దేశంలో నాలుగు ఉండగా మన తెలుగు రాష్ర్టాల్లో ఒక్కటీ లేదు.ఐక్యరాజ్య సమితి 2011-20 సంవత్సరాలను జీవ వైవిధ్య దశాబ్దంగా ప్రకటించింది. ప్రతి రెండేళ్లకోసారి అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నది. ఇప్పటి వరకు 11 అంతర్జాతీయ సదస్సులను నిర్వహించింది.
దేశంలో అంతరించి పోతున్నాయి..
ఐక్యరాజ్యసమితి ప్రకారం ప్రపంచంలో అత్యధిక జీవ వైవిధ్యం కలిగిన దేశాల జాబితాలో మన దేశం ఒకటి. ఐక్యరాజ్యసమితి జీవవైవిధ్య పరిరక్షణ సమితి 17 మెగా బయోడైవర్సిటీ దేశాలను గుర్తించింది. అందులో భారత దేశం 10వ స్థానంలో ఉంది. నేషనల్ బయోడైవర్సిటీ ఆథారిటీ 2019 లెక్కల ప్రకారం దేశంలో 1,00,696 జాతుల జంతువులు ఉన్నాయి. 48,655 జాతుల మొక్కలు ఉన్నాయి. ఇది ప్రపంచ జీవ వైవిధ్యంలో 7-8 శాతం ఉంటుంది. ఇదొక రికార్డు.. కానీ ఇక్కడ వన్యప్రాణులు ప్రమాదపుటంచున ఉన్నట్లు బయోడైవర్సిటీ నివేదికలు చెబుతున్నాయి. దేశంలో 7 శాతం పక్షులు అంతరించే దశకు చేరాయి. 57 శాతం ఉభయచరాలు కనుమరుగయ్యాయి. 70 శాతం జల చేపల జాతులు అంతరించే దశలో ఉన్నాయి. ఏటా 33 శాతం వృక్షాలు రోగాలకు గురవుతున్నాయి. 1500 రకాల జాతుల మొక్కలు పలు వ్యాధులతో చనిపోతున్నాయి. అంతరించిపోతున్న జంతువుల్లో బెంగాల్ టైగర్ కూడా ఉంది. బయోడైవర్సిటీ ఆథారిటీలు విడుదల చేసిన జాబితా ప్రకారం గ్యాంజెస్ డాల్ఫిన్, మంచు చిరుత, రెడ్ పాండా, ఖడ్గమృగం, నీలగిరి తాహ్,్ర కశ్మీర్ రెడ్ స్గాగ్, ఆసియా సింహం మన దేశంలో అంతరించే దశలో ఉన్నాయి. ఈ పరిస్థితులను అదుపు చేయడానికి ప్రభుత్వం అటవీ చట్టాలు, జంతు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. గతంలో చట్టాలు, నిబంధనలు ఉన్నప్పటికీ 2002లో ప్రత్యేక జీవ వైవిధ్య చట్టాన్ని ప్రకటించింది. అది 2003 నుంచి దేశవ్యాప్తంగా అమల్లో ఉంది. ఈ చట్టం పరిధిలోకి జాతీయ జీవ వైవిధ్య అథారిటీ, జాతీయ జీవ వైవిధ్య బోర్డు, జాతీయ జీవ వైవిధ్య కమిటీలు వస్తాయి.
భూమి మీద ఉన్న ప్రతి జీవికి ప్రకృతి ఉమ్మడి ఆస్తి. ఈ ప్రకృతిలో ప్రతిజీవి ఇంకో జీవి మీద ఆధార పడి మనుగడ సాగిస్తుంది. ఇదే జీవ వైవిధ్యం. నాగరికత నేర్చిన మానవుడి విచక్షణారాహిత్యం వల్ల ఈ జీవ వైవిధ్యం ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. దీంతో మనుగడ సాగించాల్సిన జీవజాతులు అంతరిస్తున్నాయి. ఇలా ఒక రకమైన జీవులు అంతరిస్తే వాటి మీద ఆధారపడే జీవులూ నశిస్తున్నాయి.
భూమి మీద 10-14 మిలియన్ల జాతుల జీవులు
భూమి మీద అనేక రకాల జీవజాతులు ఉన్నాయి. 10-14 మిలియన్ల జాతుల జీవులు నివసిస్తున్నట్లు శాస్త్రవేత్తల అంచనా. ఇందులో 2 లక్షల 80వేల వృక్షజాతులు, 59 వేల జంతుజాతులు, 9లక్షల 50వేల కీటకాలు ఉన్నాయి. ఏటా 10వేల రకాల జాతులు కొత్తవి గుర్తింపులోకి వస్తున్నాయి. అంతే సంఖ్యలో అంతరించి పోతున్నాయి. భారతదేశంలో క్షీరదాలు 372 రకాలు, 1200 రకాల పక్షులు, 181 ఉభయచరాలు, 2వేల చేపలు, 60వేల కీటకాలు విస్తరించి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వృక్షజాతుల్లో 7శాతం జంతు జాతులు ఉండగా వాటిలో 6.5 శాతం భారతదేశంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ జీవవైవిధ్యంపై ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.
జీవ వైవిధ్యాన్ని కాపాడుకునే మార్గాలు
జీవ వైవిధ్య ప్రాముఖ్యత, అవసరం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి.
జీవివైవిధ్యం అంతరించి పోతే కలిగే విపత్కర పరిస్థితుల గురించి వివరించాలి.
విద్యా సంస్థల్లో నెలకోసారి జీవవైవిధ్య సదస్సులు స్థానికంగా ఏర్పాటు చేసుకోవాలి.
జీవవైవిధ్య పరిరక్షణకు పాటుపడుతున్న వారికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించాలి.
చిప్కో లాంటి పర్యావరణ వేత్తలు ఉంటే వారిని సాధ్యమైనంత వరకు ప్రోత్సహించాలి.
విద్యాసంస్థల్లో, ఇండ్లలో తప్పక మొక్కలు నాటేలా చట్టం తేవాలి.సామాజిక అడవుల పెంపకాన్ని పర్యావరణ వేత్తలు ఉద్యమంలా చేపట్టాలి.
ప్రభుత్వం పర్యావరణ సంబంధిత శిక్షణా కార్యక్రమాలు తరచూ ఏర్పాటు చేస్తూ జీవ వైవిధ్య అవశ్యకతను తెలియజేయాలి. జానపద కళలు, వీధి నాటకాల ద్వారా ప్రజల్లో జీవవైవిధ్యం పట్ల అవగాహన కలిగించాలి.
టెలివిజన్, రేడియో, ఆధునిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వినూత్న శైలిలో జనాలకు సులభతరమైన భాషలో సరళంగా అర్థమయ్యేలా కార్యక్రమాలు చేయాలి.
– సోర్స్ : నమస్తే తెలంగాణ
