గతంలో ఈఎంఐలపై ఇచ్చిన మారటోరియాన్ని ఇప్పుడు ఆర్బీఐ మళ్లీ పొడిగించింది. మారటోరియాన్ని మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నామన్ని, జూన్ ఒకటవ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఈ మారటోరియం వర్తిస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ఇవాళ ముంబైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. భవిష్యత్తును ఎదుర్కొనేందుకు ఆర్బీఐ జాగ్రత్తగా ఉందని, ఎటువంటి సవాల్ అయినా స్వీకరిస్తామని గవర్నర్ శక్తికాంత్ తెలిపారు. టర్మ్ లోన్లకు అదనంగా 90 రోజుల ఎక్స్‌టెన్షన్ ఇస్తున్నామన్నారు.
టర్మ్ లోన్లపై మూడు నెలల మారిటోరియాన్ని పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. లాక్‌డౌన్ పొడగింపు వల్ల ఈ నిర్ణయం తప్పడంలేదన్నారు. దేశంలో పరిశ్రమల ఉత్పత్తి మార్చి నెలలో 17 శాతం పడిపోయిందన్నారు. కీలక పరిశ్రమల ఔట్‌పుట్ 6.5 శాతానికి తగ్గినట్లు తెలిపారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధిత రంగాలు మాత్రమే ఆశాజనకంగా ఉన్నాయని, ఆహార ఉత్పత్తులు 3.7 శాతం పెరిగినట్లు చెప్పారు. భారత విదేశీ మారక విలువలు 2020-21 సంవత్సరానికి 9.2 బిలియన్లు పెరిగినట్లు తెలిపారు. 2020-21 సంవత్సరానికి జీడీపీ వృద్ధి నెగటివ్ క్యాటగిరీలోనే ఉంటుందన్నారు. రెండవ అర్థభాగంలో పుంజుకునే అవకాశాలు ఉన్నాయన్నారు.