జూన్‌1 నుంచి 8 వరకు పట్టణ ప్రగతి

రాష్ట్రంలోనే మేడ్చల్‌ జిల్లాను పట్టణ ప్రగతిలో ప్రథమ స్థానంలో నిలుపాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులకు సూచించారు. గురువారం జిల్లాలోని 4 కార్పొరేషన్లు, 9మున్సిపాలిటీల్లో నిర్వహించే పట్టణప్రగతిపై మేయర్లు, డిప్యూటీమేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌చైర్మన్లతో  మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్‌ వెంకటేశ్వర్లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జూన్‌1 నుంచి 8 వరకు పట్టణప్రగతి కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు.గతంలో మిగిలిన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. మొదటగా డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాలు, పార్కులు, చెరువులు, కుంటలను అందంగా  తీర్చిదిద్దడంతో పాటు మొక్కలను నాటాల న్నారు.కాలనీల్లో తాగునీరు,విద్యుత్‌ సమస్యలను గుర్తించి పరిష్కరించాలని కమిషనర్లను ఆదేశించారు.

 లాక్‌డౌన్‌ సమయం లో నిరుపేదలకు బియ్యం,నగదు పంపిణీలో కీలకపాత్ర పోషించిన అధికారులు, కమిషనర్లను మంత్రి అభినందించారు. అనంతరం కలెక్టర్‌ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తప్పనిసరిగా షీ-టాయిలెట్లను ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు ప్రతి ఆదివారం 10గంటల 10 నిమిషాల పాటు మురికివాడల్లో సీజనల్‌ వ్యాధుల నివారణ కోసం పరిసరాలను పరిశుభ్రం చేసి, స్థానికులకు అవగాహన కల్పించాలన్నారు.