పిలాయిపల్లి కాలువలో పరిశ్రమల వ్యర్థాలు

వ్యర్థ రసాయనాలను కాలువలోకి వదులుతున్న పరిశ్రమల నిర్వాహకులు
మానవహక్కుల కమిషన్, జిల్లా కలెక్టర్ కు పర్యావరణ వేత్తలు, పలువురి ఫిర్యాదు
నీటి నమూనాలు సేకరించిన పిసిబి అధికారులు
పిలాయిపల్లి కాల్వ కాలుష్యపు నురగలు గక్కుతోంది. గత కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో అక్కడి రసాయనా పరిశ్రమలు వదిలే వ్యర్థాలతో నీరంతా కాలుష్య కాసారంగా మారుతోంది. పోచంపల్లి మండలం నుంచి చిట్యాల మండలం పెద్దకాపర్తి వరకు ఇదే పరిస్థితి. కొంత మంది పర్యావరణ వేత్తలు, స్థానికులు కలెక్టర్, మానవహక్కుల కమిషన్ కు ఫిరా్యదు చేయడంతో వారి ఆదేశాల మేరకు గురువారం పీసీబీ అధికారులు పిలాయిపల్లి కాల్వను పరిశీలించి నీటి నమూనాలు సేకరించారు. ఆ నీటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్ పంపిస్తామని తెలిపారు.
పోచంపల్లి మండలం పిలాయిపల్లి కత్వ నుంచి చిట్యాల మండలం పెద్దకాపర్తి వరకు పారుతున్న మూసీ జలాలు కాలుష్యమయంగా మారాయి. ఇటీవల కాలువలో నీరు దిగువకు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇదే అదునుగా భావించిన పోచంపల్లి, చౌటుప్పల్ మండలాల్లోని కాలుష్యకారక పరిశ్రమల నిర్వాహకులు, ట్యాంకర్ల ద్వారా వ్యర్థాలను తరలించే మాఫియా ఖర్చులు తప్పించుకునేందుకు పిలాయిపల్లి కాలువను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. వ్యర్థ కాలుష్యాన్ని రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా కాలువలో కలపడంతో బుధవారం రాత్రి నుంచి మూసీ జలాలు నురగలు కక్కుతూ ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం సాగుకు ఉపయోగిస్తున్న మూసీ జలాలన్నీ విషతుల్యంగా మారాయి. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా అధికారులు చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. కాగా మూసీ జలాలను కాలుష్యమయంగా మార్చిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు జిల్లా కలెక్టర్, మానవహక్కుల కమిషన్, పీసీబీ ఈఈలకు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.
నీటి నమూనాలను సేకరించిన పీసీబీ అధికారులు
మండలంలోని మందోళ్లగూడెం, ఎస్.లింగోటం గ్రామాల పరిధిలో పిలాయిపల్లి కాలువను గురువారం పీసీబీ అధికారు రవీందర్, సురేష్ లు పరిశీలించారు. నీటి నమూనాలను సేకరించారు. పరీక్షల నిమిత్తం హైదరాబాద్ లోని ల్యాబ్ కు పంపిస్తామని తెలిపారు. సదరు పరిశ్రమలను గుర్తించి కఠినచర్యలు తీసుకుంటామని పీసీబీ ఈఈ రాజేందర్ తెలిపారు. కాలుష్య పరిశ్రమలపై పీసీబీ అధికారులకు ఎందుకంత ప్రేమనో అర్థం కావడం లేదని స్థానికులు వాపోతున్నారు. కాగా ఈ విషయంపై స్థానికులు, పర్యావరణ వేత్తలు స్పందిస్తూ ఎన్నిసార్లు కాలుష్య పరిశ్రమలపై ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదు. ఈ సారి ఎం చేస్తారో చూడాలి అంటున్నారు.