ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను కొనసాగించాలని ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పును వెలువరించింది. తనను ప్రభుత్వం అక్రమంగా తొలగించిందంటూ రమేశ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం నేడు తీర్పును వెలువరించింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ తెచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పేర్కొంది. రమేశ్ కుమార్‌ను తొలగిస్తూ, ఎస్‌ఈసీ నిబంధనలు మారుస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను ధర్మాసనం కొట్టేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నెలకొన్న వివాదం కారణంగా ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ రమేశ్‌ను ఎస్‌ఈసీగా తొలగించి ఆంధ్రప్రదేశ్ కొత్త ఎన్నికల కమిషనర్‌గా విశ్రాంత న్యాయమూర్తి కనకరాజ్‌ని నియమించిన సంగతి తెలిసిందే.
