తెలంగాణలో కొత్తగా మరో 169 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణపై కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తెెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్నడూ నమోదుకాని రీతిలో శుక్రవారం ఏకంగా 169 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే నలుగురు చనిపోయారు. నమోదైన కేసుల్లో తెలంగాణకు చెందిన వారే 100 మంది ఉన్నారు. సౌదీఅరేబియా నుంచి వచ్చిన వారిలో మరో 64 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వలసదారులు ఐదుగురికి కరోనా సోకినట్లు ప్రజారోగ్య డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌రావు వెల్లడించారు.

ఈ మేరకు ఆయన బులెటిన్‌ విడుదల చేశారు. మొత్తం ఇప్పటివరకు రాష్ట్రంలో 2,425 మంది కరోనా బారిన పడ్డారని తెలిపారు. వారిలో తెలంగాణకు చెందిన కేసులు 2,008 ఉండగా, వలస కార్మికులకు సంబంధించినవి 180, సౌదీ అరేబియా నుంచి వచ్చినవి 208 కేసులు, సడలింపులు ఇచ్చాక విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా 30 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 71 మంది చనిపోయారు. మొత్తం 1,381 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపారు. ప్రస్తుతం 973 మంది చికిత్స పొందుతున్నారు. ఇక తెలంగాణలో శుక్రవారం నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీకి చెందిన 82 మంది, రంగారెడ్డి జిల్లాకు చెందిన 14 మంది, మెదక్, సంగారెడ్డి జిల్లాల వారు ఇద్దరు చొప్పున ఉన్నారు.