ఎస్‌ఈసీ అంశంపై సుప్రీం కోర్టుకువెళ్తున్నాం: ఏపీ అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్

రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మధ్య వివాదంపై ఏపీ అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఎన్నికల అధికారిగా తిరిగి బాధ్యతలు చేపట్టినట్లుగా.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రకటించుకున్నారని.. హైకోర్టు తీర్పును అనుసరించి ఇది చట్ట విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 

‘నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ విజయవాడ కార్యాలయం నుంచి సర్క్యూలర్ విడుదల చేసి హైదరాబాద్‌లోని తన ఇంటికి వాహనాలు పంపించాలన్నారు. ఎస్‌ఈసీగా కొనసాగమని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ..హైకోర్టు నేరుగా ఎక్కడా చెప్పలేదు. నిమ్మగడ్డ మాత్రం తనంతట తానే .. బాధ్యతలు స్వీకరించినట్లుగా సర్క్యూలర్ విడుదల చేశారు. సుప్రీంకోర్టు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే హైకోర్టులో ఒక పిటిషన్ వేశాం. అప్పటి వరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కూడా కోరాం. 

రాష్ట్ర ఎన్నికల అధికారిని నియమించే అధికారం రాష్ట్రానికి లేదు అంటే.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు కూడా ఈ నిబంధనే వర్తిస్తుంది. అలాంటప్పుడు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ప్రభుత్వం ఎలా నియమిస్తుంది? నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను కూడా అప్పటి సీఎం చంద్రబాబు సలహా మేరకే నియమించారు. గవర్నర్ నిర్ణయంలో మంత్రి మండలి సలహా అవసరం లేదంటే.. అప్పటి సీఎం చంద్రబాబు ఇచ్చిన సలహా కూడా చెల్లదు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ నియామకం కూడా చెల్లదు.

హైకోర్టు తీర్పులో కాలవ్యవధి స్పష్టంగా చెప్పకుంటే.. 2 నెలల కాలవ్యవధి ఉంటుంది. హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ స్వీయ నియామకం చేసుకునే అధికారం లేదు. ఎస్‌ఈసీ స్టాండింగ్ కౌన్సిల్‌గా ఉన్న ప్రభాకర్‌ను రేపటిలోగా రాజీనామా చేయమని .. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆదేశించారు. ఈ విషయం ప్రభాకర్‌ నాకు ఫోన్ చేసి చెప్పారు. నాకు కొంత సమయం కావాలని ప్రభాకర్ నిమ్మగడ్డను కోరారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మాత్రం రేపటిలోగా రాజీనామా చేయమని ఆదేశించారు.