తెలంగాణలో మరో 99 మందికి కరోనా పాజిటివ్‌

తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం జరిపిన కరోనా పరీక్షల్లో మరో 99 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నలుగురు మృతి చెందగా, 35 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో 12 మంది వలస వచ్చినవారున్నారు. మిగిలినవారిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 70మంది, రంగారెడ్డిలో 7, మహబూబ్‌నగర్‌ 1, మేడ్చల్‌ 3, జగిత్యాల 1, నల్లగొండ 2, మంచిర్యాల 1, సంగారెడ్డి 1, సిద్దిపేటలో ఒకరు ఉన్నారు. మృతులలో ఒకరు (42) హృద్రోగంతో బాధపడుతుండగా, థైరాయిడ్‌ సంబంధిత వ్యాధితో మరొకరు(41) ఉన్నారు. హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న ఓ వృద్ధురాలు (70), మరో 60 ఏండ్ల మహిళ మరణించినట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,891 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా అందులో 92 మంది మరణించారు. 1,526 మంది చికిత్సకు కోలుకొని ఇండ్లకు చేరుకున్నారు. మిగిలిన 1273 మంది దవాఖానలో చికిత్స పొందుతున్నారు.