తెలంగాణలో కొత్తగా 127 మందికి కరోనా పాజిటివ్

తెలంగాణలో గురువారం కొత్తగా 127 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధి 110, ఆదిలాబాద్‌ 7, రంగారెడ్డి 6, మేడ్చల్‌ 2, సంగారెడ్డి 1, ఖమ్మం జిల్లాలో ఒక కేసు ఉన్నాయి. ఒక్కరోజే ఆరుగురు మృత్యువాతపడగా, 31 మంది చికిత్స ద్వారా కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 3,147 మందికి వైరస్‌ సోకగా, 105 మంది చనిపోయారు. 1,587 మంది చికిత్స ద్వారా కోలుకొని ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం 1,455 మంది గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.

16 మంది ఎంజీఎం వైద్యులకు కరోనా నెగెటివ్‌

వరంగల్‌ చౌరస్తా: వరంగల్‌లోని ఎంజీఎం పీజీ వైద్యులకు రిపోర్టులు కరోనా నెగెటివ్‌ వచ్చినట్టు దవాఖాన ‘కొవిడ్‌-19 విభాగం’ నోడల్‌ అధికారి చంద్రశేఖర్‌ గురువారం తెలిపారు. మే 30న కరోనా అనుమానితుడు కుమార్‌పల్లి ప్రాంతానికి చెందిన వ్యకి దవాఖానలో చేరగా అతనికి పలువురు డాక్టర్లు వైద్యసేవలందించారు. ఈ క్రమంలో అనుమానితుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆందోళనకు గురయ్యారు. స్వచ్ఛందంగా వారు వైద్యపరీక్షలకు ముందుకు రాగా, బుధవారం నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. 16 మంది పీజీ వైద్యులకు కరోనా సోకలేదని నిర్ధారిస్తూ గురువారం రిపోర్టులు రావడంతో అంతా ఊపిరి     పీల్చుకున్నారు.