ప్రమాదకరంగా మారుతున్న ప్లాస్టిక్
హరితహారంతో పెరుగుతున్న పచ్చదనం
నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రతి వస్తువును తనలో జీర్ణం చేసుకుని తిరిగి మన అవసరాలకు అందించే భూమి.. మితిమీరిన ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా కాలుష్యభారంతో కన్నీరు పెడుతోంది. మనం నిత్యం వినియోగించే ప్లాస్టిక్ నీళ్ల సీసా భూమిలో పూర్తిగా కరిగిపోయేందుకు సుమారు 450సంవత్సరాలు పడుతుందని మీకు తెలుసా..?! ఇకనైనా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలి. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ప్రతిజ్ఞ చేయాలి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘హరితహారం’లో భాగస్వాములై మొక్కలు పెంచాలి.
భూమిపై నివసించే జీవరాశుల మనుగడను శాసించే పర్యావరణానికి ప్రస్తు తం ముప్పు వాటిల్లుతోంది. విరివిగా ప్లాస్టిక్ వినియోగం, సహజ వనరుల సంరక్షణలో నిర్లక్ష్యంతో పాటు పెరుగుతున్న కాలుష్యం కారణంగా వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తు న్నాయి. కర్బన సమ్మేళనాలు, క్లోరోఫ్లోరో కార్బన్లు వాతావరణంలోకి చేరడంతో భూతాపం (గ్లోబల్ వార్మింగ్) పెరిగిపోతోంది. పర్యావరణ పరిరక్షణకు ఐక్య రాజ్యసమితి 1972లో సదస్సు నిర్వహించింది. ఈ విషయమై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జూన్ 5ను ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ఆయా ప్రభుత్వాలు, పలు స్వచ్ఛంద సంస్థలు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి. తెలంగాణ ప్రభు త్వం కూడా పర్యావరణ పరిరక్షణకు తొలిప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించడంతో పాటు దీని వినియోగం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించింది. ఫలితంగా జనంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే పట్టణాల్లో ప్లాస్టిక్ కవర్లకు బదులుగా జూట్‌బ్యాగులను వినియోగిస్తున్నారు. దీనికి తోడు ప్రభు త్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం మొక్కలు నాటుతుండగా పచ్చదనం సైతం పెరుగుతోంది.
వీటితో పర్యావరణానికి విఘాతం
వాతావరణంలో కార్బన్‌డైఆక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్స్ అధికంగా విడుదల కావడం వల్ల పర్యావరణం దెబ్బతింటోంది. దీనికి తోడు అడవులను నరికివేయడం వల్ల సమస్యలు వస్తున్నాయి. విచ్చలవిడిగా రసాయనిక ఎరువుల వాడకం, కర్మాగారాల నుంచి వెలువడే కాలుష్యం, జల సంరక్షణ పద్ధతులు పాటించకపోవడం వంటివి పర్యావరణానికి విఘాతం కల్గిస్తున్నాయి. అవసరానికి మించి వాహనాలు, సహజ వాయువులను వినియోగించడం, రిఫ్రిజిరేటర్లతో పర్యావరణం దెబ్బతింటోంది. ప్లాస్టిక్ వాడకంతో తీవ్ర నష్టం కలుగుతోంది. నేలలో చేరిన ప్లాస్టిక్ పదార్థాలు నేల నీటి నిల్వ సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా భూసారం క్షీణిస్తోంది. మురికి కాల్వల్లో ప్లాస్టిక్ సంచులు చేరి నీటిపారుదలను అడ్డుకుంటున్నాయి. ఫలితంగా మురికి నీరు పేరుకుపోయి దోమల ఉత్ప త్తి అధికమవుతుంది. దోమలు ఎక్కువై ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.
ప్లాస్టిక్‌పై పెరిగిన అవగాహన
ప్లాస్టిక్ అందుబాటులోకి వచ్చాక ప్రతి వస్తువు తయారీలో దాన్ని కీలక పదార్థంగా వాడుతున్నారు. వస్తువుల తయారీలో ప్లాస్టిక్‌ను ఇంతగా ఉపయోగించడానికి, ప్రజామోదం పొందడానికి గల కారణాలు చాలానే ఉన్నాయి. తేలికగా వంగడం, వేడి చేస్తే కరిగిపోవడం, బలమైన రసాయన బంధాలు ఉండటం, త్వరగా పాడవకపోవడం వంటి లాభాలు ఉన్నాయి. కానీ ప్లాస్టిక్ మాత్రం మట్టిలో కలిసేందుకు వందల సంవత్సరాలు పట్టే అవకాశం ఉండడంతో ఇది ప్రమాద కారిగా మారింది. తెలంగాణ ప్రభుత్వం 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నిషేధించింది. ఈ విషయమై విరివిగా ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించింది. ఫలితంగా ప్రస్తుతం చాలా వరకు పట్టణాల్లో దీని వినియోగం తగ్గింది. జనం ప్లాస్టిక్‌కు బదులుగా చేతి సంచులు, జూట్ బ్యాగులు వినియోగిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో పరిశ్రమలు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 90భారీ, 72మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో 16 సిమెంట్ కర్మాగారాలు ఉన్నాయి. ఇవేకాకుండా 236కుపైగా రసాయన పరిశ్రమలు(మందుల తయారీ, పురుగు మందుల తయారీ, తోళ్ల శుద్ధి, ఆయిల్ పరిశ్రమ, పేపర్‌బోర్డు) ఉన్నాయి. 102సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు, 200కుపైగా పార్బాయిల్డ్ రైస్ మిల్లులు, స్టోన్‌క్రషర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. గ్రామానికి ఒకటి చొప్పున బొగ్గు బట్టీలు సైతం వెలిశాయి. వీటి ద్వారా అనేక రకాల విషపూరిత వాయువులు, కాలుష్య కారకాలు వెలువడి వాతావరణంలో కలుస్తున్నాయి.
హరితహారంతో పెరుగుతున్న పచ్చదనం
పర్యావరణం ప్రమాదానికి గురికావడం, కాలుష్యం అధకమవడానికి ప్రధాన కారణం చెట్ల నరికివేత. మానవుడు తన అవసరాలకు మించి కలపను వాడుతుండడంతో అటవీ సాంద్రత తగ్గుతోంది. కాలుష్యాన్ని నియంత్రించే శక్తి ఉన్న చెట్లు తగ్గుతుండటంతో వాతావరణంలో కాలుష్యం పెరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ప్రతి సంవత్సరం హరితహారం కార్యక్రమం ద్వారా లక్షల సంఖ్యలో మొక్కలు నాటిస్తోంది. సీఎం కేసీఆర్ ప్రత్యేక విజన్‌తో అడవుల విస్తీర్ణం కోసం చేపట్టిన ఈ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. ఐదు సంవత్సరాలుగా వర్షాకాలంలో విస్తారంగా మొక్కలు నాటుతూ వస్తున్నారు. హరితహారంలో సకల జనులను భాగస్వాములను చేస్తూ పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు. పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా రహదారులకు ఇరువైపులా, ప్రభుత్వ స్థలాలు, ఇళ్ల ముందు, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డు ప్రాంతాలు ఇతర ప్రదేశాల్లో మొక్కలను నాటిస్తున్నారు. ఇప్పటి వరకు హరితహారం కింద నాటిన మొక్కలు ఎదిగి వృక్షాలుగా మారి పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. గత సంవత్సరం నుంచి ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటేందుకు అవసరమైన మొక్కల కోసం ప్రత్యేకంగా నర్సరీలను ఏర్పాటు చేసింది. ప్రతి గ్రామంలో, పట్టణాల్లో కూడా వీటిని ఏర్పాటు చేసి అన్ని రకాల మొక్కలు పెంచుతున్నారు. మొక్కలను పరిరక్షించేందుకు ప్రత్యేకంగా వన సంరక్షకులను ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం కూడా జూన్ చివరి వారంలో హరితహారం కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం
పరిశ్రమల నుంచి విష వాయువులు బయటకు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఆయా కంపెనీల వారు తమ పరిధిలోని ప్రజల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించేలా చూస్తున్నాం. మొక్కలను పెంచేందుకు జిల్లాలోని అన్ని పరిశ్రమల యజమానులకు సూచనలిచ్చాం. హరితహారంలో భాగంగా వారు మొక్కలు నాటేందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశాం. జిల్లాలో ప్లాస్టిక్ కాలుష్యం అధికంగా ఉంది. దీని వల్ల కలుగుతున్న నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు కూడా వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాలి. పాత కాగితాలను సేకరించి రీసైక్లింగ్ చేయడం వల్ల అడవులపై ఒత్తిడి తగ్గుతుంది.
-బి.రాజేందర్, కార్యనిర్వాహక ఇంజినీర్, కాలుష్యనియంత్రణ శాఖ
