ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్తగా రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. వారిని చికిత్స కోసం గాంధీ దవాఖానకు తరలించారు. హైదరాబాద్‌లో నివాసముంటున్న ఓ యువకుడు స్వగ్రామమైన నల్లగొండ సమీపంలోని దండెంపల్లికి జూన్ 2న వెళ్లాడు. తన ఇంట్లో జరిగిన ఓ వేడుకలో పాల్గొన్నాడు. అనంతరం జూన్ 4న హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. తర్వాత అతనికి కరోనా లక్షణాలైన సర్ది, దగ్గు రావడంతో దవాఖానలో కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. ఇందులో అతనికి పాటివ్ వచ్చింది. దీంతో అతన్ని గాంధీకి తరలించిన అధికారులు, అతని కాంటాక్టులు ఎవరని తేల్చేపనిలో పడ్డారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారి వివరాలను సేకరిస్తున్నారు.
చౌటుప్పల్ మున్సిపాలిటికి చెందిన ఓ వృద్ధుడు రంజాన్ పండుగను హైదరాబాద్‌లో ఉంటున్న తన కొడుకు ఇంట్లో జరుపుకున్నాడు. అక్కడి నుంచి ఐదు రోజుల క్రితం చౌటుప్పల్ టౌన్‌కు వచ్చాడు. తీవ్రమైన జ్వరంతో ఇబ్బంది పడుతున్న అతన్నుంచి నమూనాలను సేకరించిన వైద్య సిబ్బంది, పరీక్షల కోసం గాంధీ దవాఖానకు పంపించారు. ఇందులో అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతన్ని చికిత్స కోసం గాంధీకి తరలించారు. ఆయన ఇంటి చుట్టుపక్కన ఉంటున్న 25 మందిని స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు సూచించారు. కరోనా సోకిన వ్యక్తి మందులు కొనుగోలుచేసిన మెడికల్ షాప్‌ను అధికారులు మూసివేశారు.