కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయం అంతా ఇంతా కాదు. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకుల వణికిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికి ఏపీలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గడం లేదు. చాపకింద నీరులా విస్తరిస్తూ రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. ఏపీలో కొత్తగా ఒక్క రోజే 199 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. తాజగా పాజిటివ్ కేసుల సంఖ్య 3,718 చేరుకుంది. ఇవాళ మొత్తం 17,695 శాంపిల్స్ ను సేకరించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
అయితే కొత్తగా నమోదైన కేసుల్లో ఏపీకి చెందిన వారు 130 మందికి ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన 69 మందికి పాజిటివ్ గా తేలినట్లు వైద్యులు తెలిపారు. కాగా, కొత్తగా ఇద్దరు కరోనాతో మృతి చెందారు. వీరిలో కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో మరొకరు మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 75 మంది మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. 1290 యాక్టివ్ కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు 2,353 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.