రాష్ట్రంలో కరోనా వైరస్ అంతకంతకూ ఉధృతమవుతోంది. కొన్నిరోజులుగా కేసులు భారీగా నమోదవుతుండగా..తాజాగా మరణాల సంఖ్య కూడా ఎక్కువైంది. ఆదివారం ఒక్కరోజే ఏకంగా 14 మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయినవారి సంఖ్య 137కి చేరింది. ఇక కొత్తగా 154 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 132 కేసులు ఉండగా.. రంగారెడ్డి జిల్లాలో 12, మేడ్చల్ జిల్లాలో 3, యాదాద్రి జిల్లాలో 2, సిద్దిపేట, మహబూబాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, కరీంనగర్ జిల్లాలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. మొత్తమ్మీద రాష్ట్రంలో ఇప్పటివరకు 3,650 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా.. 1,742 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 1,771 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
