దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతున్నది. వరుసగా ఆరో రోజూ తొమ్మిది వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 9983 పాజిటివ్ కేసులు నమోదవడంతోపాటు, 206 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,56,611కి పెరిగింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1,24,095 మంది బాధితులు కోలుకోగా, మరో 1,25,381 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో ఇప్పటివరకు ఈ ప్రాణాంతక వైరస్ వల్ల 7135 మంది మరణించారు.
మహారాష్ట్రలో ఆదివారం కొత్తగా 3007 పాజిటివ్ కేసులు నమోదవడంతో కరోనా పుట్టిళ్లు చైనాను వెనక్కి నెట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతం 85,975 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. చైనాలో ఇప్పటివరకు 83,036 కేసులు నమోదయ్యాయి. దీంతో చైనాకంటే ఎక్కువ కరోనా కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదవడం విశేషం. 31,667 కరోనా కేసులతో తమిళనాడు రెండో స్థానంలో ఉండగా, 27,654 కేసులతో ఢిల్లీ, 20,700 పాజిటివ్ కేసులతో గుజరాత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్ (9401), పశ్చిమబెంగాల్ (8187), కర్ణాటక (5452), బీహార్ (5088)లో ఐదువేలకు పైచిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.