దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కరోనా కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. కేసుల సంఖ్యపరంగా మహారాష్ట్ర ఇప్పటికే చైనాను దాటేసింది. గడచిన 24 గంటల్లో ఇదివరకెన్నడూ లేనంతగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం కొత్తగా 9,987 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 2,66,598కు పెరిగింది.
మహమ్మారి బారినపడి 24 గంటల్లో మరో 331మంది చనిపోయారు. దీంతో కరోనా వల్ల మృతిచెందిన వారి సంఖ్య 7,466కు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,29,917 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ 1,29,215 మంది కోలుకున్నారు. వరుసగా ఏడోరోజూ 9వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
