ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తాము ప్రోత్సాహకాలు కోరుకుంటున్నామని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు అండగా ఉంటానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాకు చెప్పడం ఆనందాన్ని కలిగించిందని చిరంజీవి చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్జగన్తో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ..ఏడాదికాలంగా సీఎం జగన్ను కలవాలనుకున్నాం. కరోనాకారణంగా షూటింగ్ లేక ఇబ్బందిపడ్డాం. విశాఖలో స్టూడియోకు వైఎస్సార్ హయాంలో భూమి ఇచ్చారు. ఆ భూమిలో పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఏపీలో కూడా సినిమా షూటింగ్లకు సీఎం జగన్ అనుమతిచ్చారు. థియేటర్లు మినిమం ఫిక్స్డ్ ఛార్జీలు ఎత్తివేయాలని సీఎం జగన్ను కోరాం. టికెట్ల ధరల ఫ్లెక్సీ రేట్లపై దృష్టి పెట్టాలని కోరాం. మా ప్రతిపాదనలను పరిశీలిస్తామని జగన్ మాకు హామీనిచ్చారని చిరంజీవి పేర్కొన్నారు. ఈ సమావేశంలో చిరంజీవితోపాటు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, నిర్మాతలు దిల్రాజు, సి కల్యాణ్, పొట్లూరి వరప్రసాద్, నటుడు అక్కినేని నాగార్జున పాల్గొన్నారు.