దివీస్‌ ఫార్మా కంపెనీకి ఎన్జీటీ నోటీసులు

దివీస్‌ ఫార్మా కంపెనీకి నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నోటీసులు జారీ చేసింది. కాలుష్యాన్ని వెదజల్లుతూ పర్యావరణానికి నష్టం కలిగిస్తోందని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన కాలుష్య పరిరక్షణ సమితి ఎన్జీటీని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన జరిపిన జస్టిస్‌ రామకృష్ణన్‌ నేతృత్వంలోని ఎన్జీటీ కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ ప్రభుత్వం సహా దివీస్‌ ఫార్మా కంపెనీకి నోటీసులు జారీ చేసింది.

అలాగే ఫార్మా కాలుష్యంపై విచారణ జరిపేందుకు ఎన్జీటీ చౌటుప్పల్‌లో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులుగా కేంద్ర పర్యావరణ శాఖ ఫార్మా వ్యవహారాల విభాగం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఐఐటీ, తెలంగాణ డ్రగ్‌ కంట్రోల్‌ శాఖ, యాదాద్రి జిల్లా కలెక్టర్‌ను చేర్చింది. చౌటుప్పల్‌ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఫార్మా కంపెనీలు వ్యవహరిస్తూ కాలుష్యానికి కారణమైతే తీసుకోవాల్సిన చర్యలను నివేదించాలని పేర్కొంది. తదుపరి విచారణను ఆగష్టు 21కి వాయిదా వేసింది.