బిర్యానీ సెంటర్ నిర్వాహకుల నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ మహిళా ఎస్‌ఐ సుశ్మిత ఏసీబీ అధికారులకు చిక్కింది. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ కే. భద్రయ్య తెలిపిన వివరాల మేరకు.. కోనరావుపేట మండలంలోని కనకర్తికి చెందిన తిరుపతి, సంజీవ్, చందుర్తి మండలం అనంతపల్లికి చెందిన సురేశ్ బిర్యానీ సెంటర్‌తో పాటు అవసరమైన వారికి చికెన్, మటన్ కర్రీలు వండి ఇస్తారు.
లాక్‌డౌన్ తర్వాత మే 12న మద్యం దుకాణాలు తెరవడంతో బిర్యానీ సెంటర్‌ను తెరిచారు. అదే రోజు ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని ఎక్సైజ్ ఎస్‌ఐ సుశ్మిత కోనరావుపేటలోని బిర్యానీ సెంటర్‌ను తనిఖీ చేసి, అనమతులు లేకుండా నిర్వహిస్తున్నారని వంట సామగ్రి, సిలిండర్‌ను తీసుకువచ్చారు. సమీపంలో శ్రీలక్ష్మీ నర్సింహస్వామి వైన్స్ నిర్వాహకుల ఫిర్యాదుతో దుకాణాన్ని సీజ్ చేశామని, మళ్లీ నిర్వహించుకోవాలంటే రూ.25 వేలు లంచం ఇవ్వాలని ఎక్సైజ్ ఎస్‌ఐ నిర్వాహకులను డిమాండ్ చేసింది.
అయితే డబ్బులు ఇచ్చుకోలేమని పలుమార్లు బతిమాలినా వినకపోవడంతో మే 21న ఏసీబీ అధికారులను అశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు నిఘా వేయగా, రూ.20 వేలు ఎక్సైజ్ ఎస్‌ఐకు ఇవ్వడానికి నిర్వాహకులు ఒప్పందం చేసుకున్నారు. బుధవారం డబ్బులు ఇవ్వడానికి ఎక్సైజ్ ఎస్‌ఐకి ఫోన్ చేయగా, సిరిసిల్ల మానేరు వంతెన సమీపంలో ఎల్లమ్మ ఆలయ ప్రాంతంలోకి రావాలని సూచించింది. దీంతో వారు అక్కడికి చేరుకుని ఎక్సైజ్ ఎస్‌ఐ సుశ్మిత, కానిస్టేబుల్ రాజుకు రూ.20 వేలు ఇచ్చారు.
అప్పటికే ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకోగా, వారిని గమనించిన కానిస్టేబుల్ రాజు పరారయ్యాడు. ఎక్సైజ్ ఎస్‌ఐ సుశ్మితను అదుపులోకి తీసుకుని సిరిసిల్ల ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి, విచారించారు. ఈ మేరకు ఎక్సైజ్ ఎస్‌ఐ సుశ్మిత, కానిస్టేబుల్ రాజుపై కేసు నమోదు చేశామని, ఆమెను కస్టడిలోకి తీసుకుని, కోర్టులో హాజరు పరుచుతామని డీఎస్పీ పేర్కొన్నారు.
