రుణాల మారిటోరియంపై స్పష్టత కోరిన సుప్రీంకోర్టు

రుణాల మారిటోరియంపై బ్యాంకులు స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరింది. రుణ వాయిదాల (ఈఎంఐ) చెల్లింపునకు ఆరు నెలలు వెసులుబాటు ఇచ్చినప్పటికీ అదనపు చార్జీలు విధిస్తూ వడ్డీపై వడ్డీ వసూలు చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐ మూడు రోజుల్లో సంయుక్తంగా సమావేశమై ఓ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కరోనా నేపథ్యంలో అన్ని రుణాల ఈఎంఐలను మూడు నెలల తర్వాత చెల్లించవచ్చని ఆర్బీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే. మార్చి నుంచి మే 31 వరకు వర్తించే ఈ మారిటోరియం గడువును ఇటీవల మరో మూడు నెలలకు పెంచించి. దీంతో వినియోగదారులు తమ రుణాల ఈఎంఐల చెల్లింపును ఆగస్టు 31వరకు వాయిదా వేసుకునే వెసులుబాటు ఉన్నది. 

అయితే మారిటోరియం రుణాలపై అదనపు చార్జీలు వర్తిస్తాయని తమ నిబంధనల్లో బ్యాంకులు పేర్కొన్నాయి. దీనిని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నది. కాగా రుణాల మారిటోరియంపై వడ్డీని రద్దు చేయాలని బ్యాంకులను కోరబోమని ఆర్బీఐ ఇప్పటికే కోర్టుకు తెలిపింది. దీని వల్ల బ్యాంకులకు చాలా నష్టం కలుగుతుందని పేర్కొంది. ఈ కేసుపై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు దీనిపై మరోసారి స్పష్టత కోరింది. తదుపరి విచారణను జూన్‌ 17కు వాయిదా వేసింది.