హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను కాపాడే బాధ్యతను మున్సిపల్ చైర్మన్, కమిషనర్ తీసుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. హరితహారం, పట్టణ ప్రగతి, వీధి వ్యాపారులకు రుణాలపై మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, అధికారులతో కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే హరితహారంలో పురపాలక అధికారులు, ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొనాలన్నారు. ప్రతి మున్సిపాలిటీ తన బడ్జెట్‌లో పది శాతం పచ్చదనం కోసం ఖర్చుచేయాలని చెప్పారు.
ప్రతి శుక్రవారం గ్రీన్ ఫ్రైడేగా పాటించి నాటిన మొక్కల సంరక్షణ కూడా తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రీన్ ఫ్రైడేను పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. హరితహారం అమలు సమన్వయం కోసం మున్సిపల్ శాఖ డైరెక్టరేట్‌లో ప్రత్యేకాధికారిని నియమిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి పట్టణానికి తప్పనిసరిగా ఒక నర్సరీ ఉండాలన్నారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కల్లో కనీసం 85 శాతం మొక్కలను సంరక్షించాలని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల నివారణ కోసం మరిన్ని పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామన్నారు.