ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యం కొనసాగుతూనే ఉన్నది. అన్ని దేశాల్లో కలిపి ప్రతిరోజు లక్షకుపైగా కొత్త కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో ఇప్పటికే కరోనా బాధితుల సంఖ్య 78 లక్షలు, మరణాల సంఖ్య 4 లక్షల 31 వేలు దాటింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు కొత్తగా 1,32,581 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ప్రపంచంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 78,23,289కి చేరింది.
మొత్తం కేసులలో అగ్రరాజ్యం అమెరికాలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే 37 లక్షలకుపైగా పాజిటివ్ కేసులతో కరోనా మహమ్మారికి ప్రధాన కేంద్రంగా ఆ దేశం కొనసాగుతున్నది. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు కూడా రోజురోజుకు వేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,911 మంది కరోనా రోగులు మృతిచెందడంతో మొత్తం మరణాల సంఖ్య 4,31,541కి చేరింది.