కృష్ణా జిల్లాలో లారీ, ట్రాక్ట‌ర్ ఢీ.. 9 మంది మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మ‌ది మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 16 మంది గాయప‌డ్డారు. ఖమ్మం జిల్లా మధిర మండలం గోపవరం నుంచి 25 మంది ట్రాక్టర్లో వేదాద్రి ల‌క్ష్మీ న‌ర‌సింహస్వామి ద‌ర్శ‌నానికి వెళ్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది. 

ప్ర‌మాదం గురించిన స‌మాచారం అందిన వెంట‌నే జ‌గ్గ‌య్య‌పేట పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. అంబులెన్స్‌ల‌ను ర‌ప్పించి క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృత‌దేహాల‌ను వెలికి తీసి పోస్ట్‌మార్టానికి త‌ర‌లించారు. లారీ డ్రైవ‌ర్ మితిమీరిన వేగం వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగింద‌ని పోలీసుల ప్రాథ‌మిక అంచ‌నాకు వ‌చ్చారు. ఘ‌ట‌న‌కు సంబంధించి కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు జ‌రుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.