తెలంగాణ రాష్ట్రంలో అటవీ సాంద్రతను పెంచేందుకు యాదాద్రి విధానం(మియావాకి)పై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన యాదాద్రి మోడల్ మియావాకి ఫారెస్ట్ పెంపకం మంచి ఫలితాలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు అటవీశాఖ సిద్ధమైంది. తక్కువ భూ ప్రాంతంలో ఎక్కువ మొక్కలు నాటడం, అతికొద్ది ఖర్చుతో దట్టమైన పచ్చదనాన్ని పెంచేందుకు తెలంగాణ అటవీశాఖ ఓ వినూత్న ప్రయత్నం చేస్తోంది.
క్షీణించిన అటవీప్రాంతంలో పూర్తి శాస్త్రీయ పద్దతుల్లో మట్టికి ట్రీట్మెంట్ చేయటం, వర్మీ కంపోస్టును వాడుతూ ఆ మట్టి స్వభావానికి అనుగుణమైన మొక్కలను గుర్తించి నాటడం. దాదాపు అడుగులో మొక్క చొప్పన ఎకరం భూమిలో సుమారు నాలుగు వేల వివిధ రకాల మొక్కలను నాటుతారు. పెరిగిన తర్వాత ఒకదానికి మరొకటి అడ్డురాకుండా ఉండేందుకు వృక్షజాతులను వాటి ఎత్తు, విస్తరణ ఆధారంగా మొక్కలు నాటుతారు.