తెలంగాణలో కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. తెలంగాణవ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే 730 మందికి ఈ వైరస్ సోకినట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ఒక్కరోజులో ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజా కేసులతో కలిపితే రాష్ట్రంలో కోవిడ్–19 వచ్చిన వారి సంఖ్య 7,802కు పెరిగిం ది. ఇందులో 3,861 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,731 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇక తాజాగా మరో ఏడుగురు కరోనా వైరస్ ప్రభావంతో మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 210కి పెరి గింది. రాష్ట్రంలో ఆదివారం 3,297 మందికి పరీ క్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 57,054 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 659 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత జనగామ లో 34, రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్ జిల్లాలో 9, వరంగల్‌లో 6, ఆసిఫాబాద్ లో 3, వికారాబాద్‌లో 2, సంగారెడ్డి, ఆదిలాబాద్, యాదాద్రి భువనగిరి, కొత్తగూడెం, నారాయణపేట, మెదక్, నల్లగొండ జిల్లాల్లో ఒక్కో పాజిటివ్ కేసు నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసులు 7,802 కాగా.. ఆదివారం ఒక్కరోజే ఏకంగా 9.3% కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళనకు గురిచేసే విషయమే. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 57,054 మందికి పరీక్షలు నిర్వహించగా.. 13.67% మందికి కరోనా సోకినట్లు తేలింది.