నల్లగొండలో భారీగా నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

నకిలీ విత్తనాల అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా పోలీసులు భారీ అంతర్ రాష్ట్ర నకిలీ విత్తనాల రాకెట్ ను ఛేదించారు. ఇందుకు సంబంధించి 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 30లక్షల విలువైన 15 క్వింటాళ్ల పత్తి విత్తనాలను, వాటిని ప్యాక్ చేసే మెషినరీ సామగ్రిని, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో నల్లగొండ ఎస్పీ ఏ.వి.రంగనాధ్ మీడియాకు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా చండూర్ మండలంలోని కమ్మగూడెంలో నాలుగు పత్తి విత్తన ప్యాకెట్లు సరైన ప్యాకింగ్, లేబిల్ లేకుండా కనిపించారు.

ఈ విషయం చండూర్ పోలీసుల దృష్టికి వెళ్లిది. అక్కడి నుంచి పోలీసులు విచారణ ప్రారంభిస్తే… అది తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధం ఉన్న రాకెట్ గా తేలింది. దీంతో ఎస్పీ జిల్లా స్థాయిలోనే ఏఎస్పీ సతీష్ నేతృత్వంలో ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు.రంగంలోకి దిగిన పోలీసులు ఇందులో సంబంధం ఉన్న వారిని ఒక్కొక్కరికి అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో పలు పోలీసు స్టేషన్ల పరిధిలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. ఈ మేరకు గద్వాల జోగులాంబ, నాగర్ కర్నూల్ జిల్లాలకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాలకు చెందిన మరికొందరి పాత్ర బయటపడింది. వారిని కూడా అరెస్ట్ చేశారు.

నల్లగొండ జిల్లా పరిధిలోని గుర్రంపోడు, నకిరేకల్, శాలిగౌరారం, మునుగోడు, అడవిదేవులపల్లి మండలాలకు చెందిన మరికొందరి పాత్ర వెల్లడైంది. ఇలా మొత్తం 23 మందిని అరెస్ట్ చేసారు. వీరు అక్షర, ఇండిగో కంపెనీల పేరుతో వీటిని మార్కెట్ లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇంకా పలువురు పరారీలో ఉన్నట్లు చెప్పారు. వీరిపై పీడీ యాక్టు కేసు నమోదు చేస్తామని ఎస్పీ వివరించారు.