ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారి 65కు ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సీఎం కార్యాలయం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం తంగేడువనంలో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లతో హరితహారం పై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారి 65 కి ఇరువైపులా ఎన్ని మొక్కలు నాటారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జాతీయ రహదారికి ఇరువైపులా మూడు వరుసలో మొక్కలు నాటాలని సూచించారు. డివైడర్ మధ్యలో చక్కని పూల మొక్కలు, రంగురంగుల మొక్కలు నాటాలన్నారు.
జాతీయ రహదారి పరిధిలోని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలో కమిషనర్లు పంచాయతీ కార్యదర్శులను భాగస్వాములను చేస్తూ మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. మొక్కల పెంపకం లో నిర్లక్ష్యం వహిస్తే ఉద్యోగాలు పోతాయని హెచ్చరించారు. రేపటి నుంచే ప్లాంటేషన్ పనులు మొదలు పెట్టాలని తెలిపారు. ఈ నెల 25న సీఎం కేసీఆర్ హరితహారాన్ని అట్టహాసంగా ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అదే రోజు జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు పెద్ద ఎత్తున నాటాలని తెలిపారు. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు నాటే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.
