మన పూర్వీకులు మనకు ఎంతో పచ్చదనం ఇచ్చారు – సీఎం కేసీఆర్‌

మన భవిష్యత్తు తరాలకు మనమూ ఇచ్చి తీరాలి

హరితవిప్లవంలో ప్రజాప్రతినిధులు కథానాయకులు కావాలి

ఇంటింటికి ఆరు మొక్కలు నాటాలి

నాటిన మొక్కలకు కుటుంబ సభ్యుల పేర్లు పెట్టాలి

తెలంగాణలో ప్రతి గ్రామంలో నర్సరీ ఉంది

దేశంలో ఏ రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదు

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో జరిగిన ఆరో విడత హరితహారం కార్యక్రమ ప్రారంభంలో ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ ప్రజల వ్యక్తిత్వపటిమ చాలా గొప్పదని, మనం తలుచుకుంటే జరగని పని లేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. మనపూర్వికులు మనకోసం ఎంతో కష్టపడినందుకే మనం ఇవాళ ఇట్లున్నామని, మన భవిష్యత్‌ తరాల కోసం మనం కూడా ఎంతో కొంత చేయాలి కదా. అందుకే మళ్లీ పాత అడవులు వచ్చి తీరాలి. ప్రతి ఇంటికి ఆరు చెట్లు నాటాలని సీఎం పిలుపునిచ్చారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో ఆరోవిడత హరితహారం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌, నీళ్ల ట్యాంకర్‌ను ఈ ప్రభుత్వం ఇచ్చిందని, నాటిన మొక్కలను బతికించుకునే బాధ్యత ఎవరికి వారు స్వచ్ఛంధంగా తీసుకోవాలని కోరారు. తెలంగాణలో ప్రతిగ్రామంలో నర్సరీ ఉందని, దేశంలో ఏరాష్ట్రంలోనూ ఈ పరిస్థితి లేదన్నారు.

’92 వేల ఎకరాల అడవిని పోగొట్టుకున్నాం. సినిమా షూటింగులకోసం నర్సాపూర్‌ అటవీప్రాంతాన్నే ఎంచుకునేవాళ్లు. గతంలో నర్సాపూర్‌ అడవుల్లో చాలా షూటింగులు జరిగాయి. సమష్టి కృషితోనే ఈ అటవీ ప్రాంతానికి పునరుజ్జీవం కలుగుతుంది. అడవులు కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంది. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కథానాయకులు కావాలి. ఇందులో ప్రజల సహకారం కూడా కావాలి’ అని సీఎం అన్నారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు నాటాలి. నాటిన మొక్కలకు కుటుంబ సభ్యుల పేర్లు పెట్టాలి. మొక్క ఎండిపోతే బిడ్డ ఎండిపోయినట్లు అని సెంటిమెంట్‌ క్రియేట్‌ చేయాలని చెప్పారు.

అల్లనేరేడు మొక్క నాటిన సీఎం కేసీఆర్‌
ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌లో అల్లనేరేడు మొక్కను నాటి ప్రారంభించారు. అలాగే నర్సాపూర్‌లో అర్బన్‌ ఫారెస్ట్‌ను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 కోట్ల మొక్కలు నాటేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. 34 శాఖల సమన్వయంతో రాష్ట్ర అటవీశాఖ ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్నది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికే ఎక్కడికక్కడ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామ గ్రామాన హరితహారం జోరుగా కొనసాగుతుంది.

నర్సాపూర్‌ అర్బన్‌పార్క్‌ విశిష్టతలు…
నర్సాపూర్‌ అర్బన్‌పార్క్‌లో అనేక విశిష్టతలున్నాయి. ఇది ఐదు అటవీ కంపార్ట్‌మెంట్‌లలో 4,380 ఎకరాల అటవీ ప్రాంతం. 630 ఎకరాల్లో ఫారెస్ట్‌ పార్క్‌ ఉన్నది. ఇందుకోసం రూ.8 కోట్ల వ్యయంచేశారు. 15 కిలోమీటర్ల మేర రక్షణ ప్రహరీ (సీ త్రూ వాల్‌, చైన్‌ లింక్‌ ఫెన్సింగ్‌)తో నిర్మాణం జరిగింది. సహజసిద్ధమైన అడవులు, ఎత్తైన కొండలు, పక్షుల కిలకిలరావాలు.. ఎత్తైన వాచ్‌టవర్‌, ప్రత్యేక ముఖద్వారాలతో నర్సాపూర్‌ అర్బన్‌ పార్క్‌ ప్రకృతి ప్రేమికులను ఆహ్వానిస్తుంటుంది.

ఈ అటవీ ప్రాంతం 256 పక్షి జాతులకు నిలయంగా ఉన్నది. తెలంగాణలో 434 పక్షి జాతులుండగా.. అందులో 60 శాతం నర్సాపూర్‌ అటవీ ప్రాంతంలోనే ఉండటం విశేషం. ఇక్కడ ఉండే 256 పక్షి జాతుల్లో 173 స్థానికమైనవి. మిగతా 83 రకాలు వలస పక్షులు. ఇవి వేసవి, శీతాకాలంలోనే ఇక్కడికి వచ్చి సేదతీరుతుంటాయి.

కాలి నడకన తిరుగుతూ అడవి పునరద్దరణను పరిశీలించిన ముఖ్యమంత్రి
ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతంలో నేరేడు మొక్కను నాటి ప్రారంభించారు. 630 ఎకరాల్లో అభివృద్ది చేసిన నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. నర్సాపూర్ అడవుల్లో చేపట్టిన అటవీ పునరుద్ధరణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. అటవీ ప్రాంతంలో కాలి నడకన తిరుగుతూ అడవి పునరద్దరణ కోసం చేపట్టిన చర్యలను పరిశీలించారు. నేచురల్ ఫారెస్ట్, రాక్ ఫిల్ డ్యాం, వాటర్ హార్వెస్టింగ్ తదితర పనులను పరిశీలించారు. ఎతైన కొండపై నిర్మించిన వాచ్ టవర్ నుండి ముఖ్యమంత్రి అటవీ ప్రాంతాన్నంతా సందర్శించారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాలయిన ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రమే ప్రస్తుతం అడవి ఉందని, ఆ ప్రాంతం కాక దట్టమైన అడవి వున్న ఎకైక ప్రాంతం రాష్రంలో నర్సాపూర్ మాత్రమేనని ముఖ్యమంత్రి అన్నారు. ఈ అడవిని కాపాడుకోవడానికి, అటవీ ప్రాంతంలో పోయిన అడవిని పునరుద్ధరించడానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని కోరారు.