తెలంగాణలో మరో 920 మందికి కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 3,616 మందికి పరీక్షలు చేయగా 920 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 11,364కి చేరింది. ఇందులో 6,446 మంది వివిధ ఆస్పత్రులు, హోంక్వారంటైన్‌లలో చికిత్స పొందుతుండగా.. 4,688 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. గురువారం కరోనాతో ఐదుగురు మరణించగా.. ఇప్పటివరకు ఈ వైరస్‌ కారణంగా చనిపోయినవారి సంఖ్య 230కి పెరిగింది.

రాష్ట్రంలో మొత్తం 70,934 మందికి పరీక్షలు చేయగా.. 59,570 మందికి నెగిటివ్‌ వచ్చింది. ఇదిలా ఉండగా గురువారం నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 737 ఉండగా.. రంగారెడ్డి జిల్లాలో 86, మేడ్చల్‌ జిల్లాలో 60, కరీంనగర్‌ జిల్లాలో 13, సిరిసిల్లలో 4, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో 3 చొప్పున, ములుగు, వరంగల్‌ అర్బన్, మెదక్‌ జిల్లాల్లో రెండు చొప్పున, వరంగల్‌ రూరల్, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, జనగామ, మహబూబాబాద్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. రాష్ట్రంలో 34 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స కోసం 17,081 బెడ్‌లు సిద్దం చేయగా.. ప్రస్తుతం 1,083 బెడ్స్‌లో రోగులు ఉన్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.