తెలంగాణలో కొత్తగా 985 మందికి కరోనా పాజిటివ్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. తాజాగా 985 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు ఒక్కరోజులో ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 12,349కి చేరింది. ఇందులో 7,436 మంది వివిధ ఆస్పత్రులు, హోంఐసోలేషన్‌లలో చికిత్స పొందుతుండగా.. 4,766 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇక శుక్రవారం కరోనాతో మరో ఏడుగురు చనిపోవడంతో రాష్ట్రంలో కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 237కి పెరిగింది.

శుక్రవారం నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 774 ఉండగా.. రంగారెడ్డి జిల్లాలో 86, మేడ్చల్‌ జిల్లాలో 53, వరంగల్‌ అర్బన్‌లో 20, మెదక్‌లో 9, ఆదిలాబాద్‌లో 7, సిరిసిల్ల, నాగర్‌కర్నూల్, నిజామాబాద్‌ జిల్లాల్లో 6 చొప్పున, సిద్దిపేట, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లో 3 చొప్పున, ములుగు, జగిత్యాల, భువనగిరి జిల్లాల్లో 2 చొప్పున, మిర్యాలగూడ, వికారాబాద్, మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒక్కో కేసు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 75,308 పరీక్షలు నిర్వహించగా 16.39 శాతం పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.