మొక్కలు నాటండి.. పర్యావరణ పరిరక్షణలో భాగమవ్వండి – ప్రముఖ నటి, అక్కినేని అమల

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవ్వాలని ప్రముఖ నటి, అక్కినేని నాగార్జున భార్య అమల పేర్కొన్నారు. ఇవాళ ఆమె గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా తమ నివాసంలో మొక్కలు నాటారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కూమార్ IAS విసిరిన గ్రీన్ చాలెంజ్ ను స్వీకరించిన ఆమె తమ నివాసంలోని ఆవరణలో 5 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా కార్యక్రమం విజయవంతమవడం సంతోషం. ఇలాంటి మంచి ఆలోచనలు అరుదుగా వస్తాయనీ, వాటిని ఆచరణలో పెట్టడం ముఖ్యమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
మొక్కలు నాటిన అనంతరం ఆమె మరో నలుగురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు. వారిలో ఉపాసన కొణిదెల(రామ్ చరణ్ భార్య), వసంత వాడి(జంతు సంరక్షకురాలు), హీరా రూపానీ, బీసీహెచ్ టీమ్ ఉన్నారు. ఈ సందర్భంగా అమల రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ.. నూతన సంవత్సరంలో అందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.