నందిగామ మండలం చేగూరు గ్రామంలో ఈత మొక్కలు నాటిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లాలోని నందిగామ మండలం చేగూరు గ్రామంలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా నాలుగు వేల మొక్కలు నాటిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సిఎం కెసిఆర్ పాలనలో కులవృత్తులకు పూర్వ వైభవం వచ్చిందని తెలిపారు. సమైక్య పాలనలో తెలంగాణలో కులవృత్తులు నిర్వీర్యమయ్యాయని, తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కుల వృత్తులను బలోపేతం చేశామని ఆయన స్పష్టం చేశారు. కులవృత్తుల వారు ఆత్మగౌరవంతో జీవించేలా కెసిఆర్ పలు చర్యలు తీసుకుంటున్నారని ఆయన వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు విధిగా ఆరు మొక్కలు నాటాలని ఆయన కోరారు. మొక్కలు నాటి అడవులను సృష్టించినపుడే కరవు నివారణ సాధ్యమని ఆయన పేర్కొన్నారు. అడవుల పెంపకంపై ప్రజల్లో చైతన్యం తేవాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపి మన్నె శ్రీనివాస్ రెడ్డి , ఎంఎల్ఎ అంజయ్య యాదవ్, మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు మంచన్ పల్లి ప్రియాంక శివశంకర్ గౌడ్, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్ వై ఖురేషీ, రఘురాం తదితరులు పాల్గొన్నారు.