పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత – గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్రగృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం గచ్చిబౌలిలోని హౌసింగ్‌ కార్పొరేషన్‌ నిర్మిత కేంద్రంలో హరితహారంలో భాగంగా మంత్రి వేముల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పచ్చదనం పెరుగాలి.. ప్రకృతిని పరిరక్షించుకోవాలనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా గృహనిర్మాణశాఖ, హౌసింగ్‌ కార్పొరేషన్‌ తరపున 2.8 ఎకరాల్లో మొక్కలు నాటినట్లు చెప్పారు. ఈ కేంద్రంలో నాటిన మొక్కలన్నీ సంరక్షించాల్సిన బాధ్యత గృహనిర్మాణశాఖ ఉద్యోగులు, సిబ్బందిపై ఉందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఇనిస్టిట్యూట్‌లలో, ట్రైనింగ్‌ సెంటర్లలో ఖాళీ స్థలాలు ఉన్న చోట పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గృహనిర్మాణశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, సీఈలు రవీందర్‌రెడ్డి, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.