గ్రేటర్‌లో కొత్తగా ఏడు సీఏక్యూఎంఎస్ కేంద్రాలు
హైదరాబాద్ నగరాన్ని బెంబేలెత్తిస్తున్న వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగుతున్నది. కాలుష్య కారకాల గుట్టు రట్టు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. ఇందులోభాగంగా గ్రేటర్‌లో కొత్తగా ఏడు నిరంతర వాయు నాణ్యత పర్యవేక్షణ నమోదు కేంద్రాలను (సీఏక్యూఎంఎస్) ఏర్పాటు చేయబోతున్నది. ఈ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ఇటీవలే ఆమోదం తెలుపగా, కొత్త స్టేషన్ల ఏర్పాటుకు పీసీబీ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. మొత్తం ఏడు స్టేషన్లకు రూ.7 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. ప్రస్తుతం టెండర్ల సాంకేతిక అధ్యయనం నడుస్తుండగా ఇది పూర్తి కాగానే అక్టోబర్‌లో కొత్త స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే గ్రేటర్‌లో ఇప్పటికే ఆరు సీఏక్యూఎంఎస్ స్టేషన్లు ఉండగా, ఒక్క జూపార్క్ మినహా మిగతావన్నీ పడమర వైపే ఉన్నాయి. దీంతో వాయువుల నాణ్యతలో పారదర్శకత ఉండటం లేదన్న వాదలున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని, కొత్త వాటిని ఒకేవైపు కాకుండా నగరం నలుమూలల ఏర్పాటు చేసే ఆలోచనలో పీసీబీ అధికారులున్నారు.
ఏక్యూఐలో భాగంగా..
జాతీయస్థాయిలో వాయువుల నాణ్యతను ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడంతో పాటు పర్యవేక్షణ చేసేందుకు సీపీసీబీ జాతీయ వాయువుల నాణ్యత సూచీ (ఏక్యూఐ)ని నమోదు చేస్తున్నది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 103 నగరాల్లో నమోదు అవుతున్న సూచీల నుంచి తెలంగాణ రాష్ట్ర రాజధాని ఒక్క హైదరాబాదే మాత్రమే స్థానం సంపాదించింది. ఇందులోభాగంగా నిరంతర వాయువుల నాణ్యత పర్యవేక్షణ స్టేషన్లు (సీఏక్యూఎంఎస్) ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి స్టేషన్లు గ్రేటర్‌లో ఆరు ఉన్నాయి. వీటి ద్వారా గాలిలోని పీఎం 10, పీఎం 2.5, కార్బన్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్, అమోనియా మోతాదును అధికారులు పరీక్షిస్తున్నారు. 24 గంటల పాటు వాయువుల నాణ్యతను పర్యవేక్షించడమే కాకుండా, కాలుష్య నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలు తీసుకోవడానికి ఈ సూచీలు ఎంతగానో ఉపయోగపడుతాయి.
పాత స్టేషన్లు..
సనత్‌నగర్, ఐడీఏ బొల్లారం, జూపార్క్ బహదూర్‌పుర, గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ, ఐడీఏ పాశమైలారం, ఇక్రిశాట్
కొత్త స్టేషన్లు(ప్రతిపాదనలు)
ఎల్బీనగర్, సైనిక్‌పురి, ఉప్పల్, జీడిమెట్ల, మెహదీపట్నం, లక్డీకాపూల్,(మరొకదానిపై అధ్యయనం నడుస్తున్నది)