విశాఖ గ్యాస్‌ లీక్ ఘటన: నిందితులకు 14 రోజులు రిమాండ్

ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ ప్రమాద ఘటన కారకులైన 12 మందికి 14 రోజుల పాటు రిమాండ్‌ విధిస్తూ బుధవారం సెకండ్‌ అడిషనల్‌ ఛీప్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ సీఈవో, డైరెక్టర్లతో సహ 12 మందిని మంగళవారం విశాఖ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 12 మందిని కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా వారికి 14 రోజుల పాటు రిమాండ్‌ విధించారు.అనంతరం వీరిని విశాఖ సెంట్రల్‌ జైలుకు తరలించారు. మే 7న ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీలో స్టైరీన్‌ వాయువు లీకైన ఘటనలో 12 మంది మృతి చెందగా 585 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదంపై సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఆధ్వర్యలో ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం నియమించింది.

ఈ కమిటీ రెండు నెలల పాటు బాధిత ప్రాంతాల్లో పర్యటించి అన్ని వర్గాల వారితో మాట్లాడి 350పేజీల నివేదికను తయారు చేసి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు సమర్పించింది. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని నివేదికలో పేర్కొన్న 24గంటల్లోనే ఎల్జీ పాలిమర్స్‌ సీఈవో, డైరెక్టర్లతో పాటు 12 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.