కాలుష్య నివారణకు పీసీబీ ఆన్‌లైన్‌ మొబైల్‌ ల్యాబ్‌తో పరీక్షలు

నిబంధనలకు విరుద్ధంగా కొన్ని పరిశ్రమలు కాలుష్య జలాలను వెదజల్లుతున్నాయి. అక్రమంగా వ్యర్థ రసాయనాల డంపింగ్‌కు పాల్పడుతున్నాయి. ఫలితంగా ఘాటు వాసనలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనికి కారకులెవరో తెలుసుకునే లోపే..ఉల్లంఘనులు అన్నీ చక్కబెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్రమార్కుల పనిపట్టేందుకు పీసీబీ సరికొత్త అస్త్రంతో సిద్ధమైంది. సాంకేతికను వినియోగించుకుని కారకులెవరో తేల్చనున్నది. ఇందుకోసం ‘ఆన్‌లైన్‌ మొబైల్‌ ల్యాబ్‌’ను రంగంలోకి దించబోతున్నది. అందుకు రూ. కోటి మంజూరు చేయగా, టెండర్లు పూర్తికాగానే అందుబాటులోకి తీసుకురానున్నది. 

ఫిర్యాదు రాగానే..

ఇటీవలి కాలంలో కాలుష్యంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ముఖ్యంగా ఘాటు వాసనలు హడలెత్తిస్తున్నాయి. రసాయన వ్యర్థ జలాల అక్రమ డంపింగ్‌లు యథేచ్ఛగా సాగుతున్నవి. వీటన్నింటిపై ఇంతకాలం పీసీబీ అధికారులు చర్యలు తీసుకుంటున్నా ..ఆశించిన ఫలితం రావడం లేదు. అధికారులు  వెళ్లడం, శాంపిళ్లు సేకరించడం, వాటిని ల్యాబ్‌లో పరీక్షించడం, 24 గంటల తర్వాత నివేదికలివ్వడం జరుగుతున్నది.  ఈ ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో నిబంధనలు ఉల్లంఘించే వారు సైతం ఏవో కారణాలు చూపించి.. తప్పించుకుంటున్నారు. మొబైల్‌ ల్యాబ్‌ అందుబాటులోకి వస్తే..ఫిర్యాదు అందగానే ఈ వాహనం నేరుగా ఆ ప్రాంతానికే వెళ్తుంది. కాలుష్య తీవ్రతలను నమోదు చేసి అక్కడిక్కడే నివేదికను వెల్లడిస్తుంది. కాలుష్యానికి కారకాలేమిటీ ?, వ్యర్థ జలాలు ఎలా వస్తున్నాయో నిగ్గు తేల్చుతుంది. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటారు.