కరోనా విజృంభిస్తోంది. రోజుకు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గురువారం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 25 మందికి పాజిటివ్ వచ్చింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో పది, మిర్యాలగూడలో నాలుగు, కోదాడలో నాలుగు, నకిరేకల్, పెద్దవూర, నార్కట్‌పల్లి, మునుగోడు, సూర్యాపేట, చింతలపాలెం, చిలుకూరులో ఒక్కొక్కటి నమోదయ్యాయి.
నల్లగొండ జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గురువారం ఏకంగా 18 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒక వృద్ధురాలు మృతి చెందింది. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 145కు చేరింది. వలసకూలీలతో కలుపుకుంటే 155కి చేరినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా. ఏ. కొండల్‌రావు తెలిపారు. మంగళ, బుధవారాల్లో కరోనా సోకిన వారి ప్రైమరీ కాంట్రాక్టు ఉన్న సుమారు 99 మంది శాంపిల్స్ సేకరించగా మరో 426 శాంపిల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. నిడుమనూ రు మండలం బంకాపురం గ్రామానికి చెందిన వృద్ధురాలు హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. దీంతో ఇప్పటివరకు జిల్లాలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య ఐదుకు చేరింది. 290 మంది హోంక్వారంటైన్‌లో ఉండగా 120 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లా కేంద్రంలో 10 కేసులు, మిర్యాలగూడలో నాలుగు, నకిరేకల్, పెద్దవూర, నార్కట్‌పల్లి మునుగోడులో ఒక్కొక్క కేసు నమోదైంది. నల్లగొండ పట్టణంలో మాన్యంచెల్కలో ముగ్గురు, దేవరకొండ రోడ్డు, ఎస్‌ఎల్‌ఎన్ కాలనీలో ఒక్కొక్కటి, శ్రీలక్ష్మీనగర్‌లోని బండారు గార్డెన్ సమీపంలో దంపతులకు, ప్రకాశంబజార్, దుప్పలపల్లి రోడ్డులో, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఒక్కొక్కటి నమోదయ్యాయి