టీటీడీలో పని చేస్తున్న 91 మంది సిబ్బందికి కరోనా సోకిందని టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. దీంతో టీటీడీలో ఎక్కువ టెస్టులు చేయాలనీ అధికారులకు సూచించినట్టు అయన చెప్పారు. అనంతపురం, కడప జిల్లాలకు చెందిన ఎస్పీఎఫ్ సిబ్బంది సెలవులపై వేరే ప్రాంతాలకు వెళ్లి రావడంతో టీటీడీలో కరోనా కలకలం రేపిందని పేర్కొన్నారు. అలిపరి వద్ద 1704, తిరుమలలో 1865 మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. అయితే చాలా మంది సిబ్బందికి ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని, టెస్టులు చేస్తే మాత్రం పాజిటివ్ వస్తుందని అన్నారు. రోజుకు సుమారు 10 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. అయితే ఇప్పటి వరకూ 634 మంది భక్తులకు కరోనా పరీక్షలను నిర్వహించగా ఎవరికీ పాజిటివ్‌గా నిర్ధారణ కాలేదని స్పష్టం చేశారు.
జూన్ 11 నుంచి జూలై 10 వరకు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్‌చేసుకున్న వారిలో 1,64,742 మంది స్వామి వారిని దర్శించుకున్నారని, 30 శాతం మంది దర్శనం చేసుకోలేదని వెల్లడించారు. నెల రోజుల్లో శ్రీవారికి హుండీ ఆదాయం రూ. 16.73 కోట్లు వచ్చిందని తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వాహణకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు. భక్తుల అనుమతి, ఇతర ఏర్పాట్లు వంటి విషయాలపై అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయిస్తామన్నారు.