రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గ్రీన్ ఛానల్లో పెట్టి వారికి నిర్ణీత సమయానికి జీతాలు అందించాలన్నారు. పర్మినెంట్ ఉద్యోగుల్లాగానే వారికి సామాజిక, ఆరోగ్య భద్రత కల్పించే దిశగా అధ్యయనం చేయాలని, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తనకు అందించాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. ప్రభుత్వ విభాగాలతో పాటు, వివిధ సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల విడుదలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల స్థితిగతులపై క్యాంపు కార్యాలయంలో సీఎం ఉన్నతాధికారులతో సోమవారం సమీక్షించారు. సీఎస్ నీలం సాహ్ని, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్, జీఏడీ సర్వీసెస్ సెక్రటరీ శశిభూషణ్, కార్మిక శాఖ కార్యదర్శి ఉదయలక్ష్మి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ మల్లికార్జున్ ఈ సమీక్షలో పాల్గొన్నారు.