మాజీ మంత్రి పితాని కుమారుడికి హైకోర్టు షాక్‌

  • ముందస్తు బెయిల్‌ పిటీషన్‌ తిరస్కరణ..

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించినఈఎస్‌ఐ కుంభకోణం కేసులో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట సురేష్‌ సహా మరో ఇద్దరి ముందస్తు బెయిల్ పిటిషన్‌ కోర్టు తిరస్కరించింది. ఏ క్షణమైనా అరెస్టు చేస్తారనే భయంతో పితాని కుమారుడు వెంకట సురేష్‌, పితాని పీఎస్‌ మురళీమోహన్‌ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కాగా సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మురళీమోహన్‌ను శుక్రవారం ఏసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే..

తెలుగుదేశం ప్రభుత్వ హయంలో అచ్చెన్నాయుడు తర్వాత పితాని సత్యనారాయణ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. అచ్చెన్నాయుడు హయాంలో మందుల కొనుగోలు, పరికరాల కొనుగోలులో పెద్ద ఎత్తున స్కాం జరిగింది. ఆ స్కాం పితాని సత్యనారాయణ హయాంలోనూ కొనసాగింది. పితాని మంత్రిగా ఉన్న సమయంలో కార్మికశాఖలో ఏ పని జరగాలన్నా మంత్రి కుమారుడు వెంకట్‌ కనుసన్నల్లోనే జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. ఏ కాంట్రాక్టు కావాలన్నా వెంకట్‌ను కలిసి పది శాతం చెల్లిస్తేనే పనులు జరిగినట్లుగా ప్రచారం జరిగింది. తమ పనుల కోసం కాంట్రాక్టర్లు పితాని స్వగ్రామం కొమ్ముచిక్కాలకు క్యూ కట్టేవారు. పితాని వెంకట్‌ చీటీపై టెండర్లు ఎవరికి కేటాయించాలో రాసిచ్చేవారని, దాని ఆధారంగానే పనులు జరిగేవని తెలుస్తోంది.